‘గో బ్యాక్ సీఎం సార్..’ విశాఖలో పోస్టర్ల కలకలం

విశాఖను అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వం చెబుతున్నా, అక్కడే వ్యతిరేకంగా పోస్టర్లు పడటం మాత్రం చర్చనీయాంశమవుతోంది. పైగా ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విశాఖలో కలకలం రేగింది.

Advertisement
Update:2023-03-17 11:10 IST

ఇప్పటి వరకూ ఏపీలో ‘థ్యాంక్యూ సీఎం సార్’ అనే ప్లకార్డులు బాగా వైరల్ అయ్యేవి. సీఎం జగన్ ఎక్కడ, ఏ సభకు వెళ్లినా అక్కడకు వచ్చే జనాల చేతిలో ‘థ్యాంక్యూ సీఎం సార్’ అనే ప్లకార్డులు పెట్టేవారు. విద్యార్థులు, ఉద్యోగులు.. ఇలా అందరూ ఈ ప్లకార్డులు పట్టుకుని జగన్ కి ధన్యవాదాలు తెలుపుతూ నిలబడేవారు. కానీ తొలిసారిగా ఏ పీలో ‘గో బ్యాక్‌ సీఎం సార్‌’ అనే పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. అది కూడా భావి రాజధానిగా చెప్పుకుంటున్న విశాఖలో.

విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్, మద్దిలపాలెం, సిరిపురం, అశిల్‌ మెట్ట సర్కిల్ ప్రాంతాల్లో ‘గో బ్యాక్‌ సీఎం సార్‌’ అనే పోస్టర్లు వెలిశాయి. వీటిని వెంటనే వైసీపీ నేతలు తొలగించారనుకోండి. అయితే అప్పటికే ఆ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సీఎం జగన్ ని విశాఖ రావొద్దంటూ జన జాగరణ సమితి పేరుతో పోస్టర్లు వెలిశాయి.

కారణం ఏంటి..?

విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించిన సీఎం జగన్.. చకచగా అడుగులు వేస్తున్నారు. కోర్టు కేసుల్ని పక్కనపెట్టి, వివాదాల జోలికెళ్లకుండా సచివాలయం సహా ఇతర కార్యకలాపాలను విశాఖకు తరలిస్తున్నారు. జులై నుంచి విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించాలనేది జగన్ ఆలోచన. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో విశాఖకు వెళ్లేందుకు మంత్రులు కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ దశలో జనజాగరణ సమితి పేరుతో విశాఖలో కొంతమంది పోస్టర్లు వేశారు. ముందు అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయండి అనే అర్థం వచ్చేలా పోస్టర్లు పడ్డాయి. అంటే అమరావతి రాజధాని కావాలని కోరుకుంటున్నవారు జగన్ కి వ్యతిరేకంగా పోస్టర్లు వేసినట్టు అర్థమవుతోంది.

రెండు మూడు పోస్టర్లు పడినంత మాత్రాన జగన్ కి తరిగిపోయేదేమీ లేదు, ప్రభుత్వం విశాఖకు తరలిరాకుండా ఉండదు. కానీ విశాఖను అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వం చెబుతున్నా, అక్కడే వ్యతిరేకంగా పోస్టర్లు పడటం మాత్రం చర్చనీయాంశమవుతోంది. పైగా ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విశాఖలో కలకలం రేగింది.

Tags:    
Advertisement

Similar News