రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల సేకరణే లక్ష్యంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.

Advertisement
Update:2023-02-27 10:20 IST

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 కోసం విశాఖ నగరం ముస్తాబవుతోంది. మార్చి 3, 4 తేదీల్లో ఈ సమ్మిట్‌కు ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదిక కానున్నది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది పారిశ్రామిక వేత్తలకు ఈ సమ్మిట్‌లో పాల్గొనాలని ఆహ్వానాలు పంపారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఏపీలోని విశాఖపట్నానికి అందరూ తప్పకుండా రావాలని సీఎం వైఎస్ జగన్, ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ గతంలోనే కోరారు.

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఏపీలో ఉన్న వనరులు, శక్తి సామర్థ్యాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలు.. ఏపీ పారిశ్రామిక ప్రగతిని ఈ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టర్లకు వివరించనున్నది. విశాఖలో రెండు రోజుల పాటు జరుగనున్న ఈ సమ్మిట్‌లో అగ్రశ్రేణి కంపెనీలు, ప్రతినిధులు పాల్గొంటారని అధికారులు చెబుతున్నారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉంటుందని ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచానికి వివరిస్తామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. పరిశ్రమల స్థాపనకు రాష్ట్రం చాలా అనువైన ప్రదేశం అన్నారు. రూ.2లక్షల కోట్ల పెట్టుబడుల సేకరణే లక్ష్యమని మంత్రి చెప్పారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో గత మూడు సంత్సరాలుగా ఏపీనే టాప్ పొజిషన్‌లో ఉందని మంత్రి అమర్‌నాథ్ చెప్పారు. ఎగుమతుల విషయంలో ఏపీ దేశంలోనే నాలుగవ స్థానంలో ఉందని గుర్తు చేశారు. గతంలో ఎక్కడో అట్టడుగు ఉన్న రాష్ట్ర ర్యాంకులు వైసీపీ హయాంలో సింగిల్ డిజిట్‌కు చేరుకున్నాయని అమర్‌నాథ్ వెల్లడించారు. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖలు అనేక అవార్డులను గెలుచుకున్నాయి. ఈ విషయాలన్నీ ఇన్వెస్టర్లకు చెప్పాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రానికి సహజ సిద్ధంగా ఉన్న అనుకూలతలను కూడా ప్రపంచానికి చాటి చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి పేర్కొన్నారు.

ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల గురించి పదే పదే చెబుతున్నారు. మార్చి 22 తర్వాత విశాఖ కేంద్రంగా పాలన కొనసాగిస్తానని కూడా గతంలోనే స్పష్టం చేశారు. ఈ క్రమంలో విశాఖ నగరాన్ని పారిశ్రామిక కేంద్రంగా మార్చేందుకు.. భారీగా పెట్టుబడులు పెట్టించేందుకు ఈ సమ్మిట్‌ను వేదికగా మలచుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. విశాఖ చరిత్రలో ఈ సదస్సు ఒక మైలు రాయిగా నిలిచిపోయేలా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Tags:    
Advertisement

Similar News