సమాచార కమిషనర్ల ఆస్తులు వెల్లడించమని ఆదేశాలు ఇవ్వండి.. ఏపీ గవర్నర్‌కు మాజీ కేంద్ర కార్యదర్శి లేఖ

సమాచారాన్ని వెల్లడించే విషయంలో ఏపీ ప్రధాన సమాచార కమిషనర్ మహబూబ్ బాషా ఒక బెంచ్ మార్క్ సృష్టించారని శర్మ ప్రశంసలు కురిపించారు.

Advertisement
Update:2023-05-30 16:47 IST

ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ ఆర్. మహబూబ్ బాషా తన ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఏపీలో తొలి సారిగా సొంత ఆస్తులు ప్రకటించిన చీఫ్ కమిషనర్‌గా మహబూబ్ బాషా రికార్డులకు ఎక్కారు. ఇంత వరకు ఏ సమాచార చీఫ్ కమిషనర్ లేదా కమిషనర్ ఇలా స్వచ్ఛందంగా ఆస్తులను బహిరంగంగా వెల్లడించలేదు. కాగా, చీఫ్ కమిషనర్ ఆస్తులు వెల్లడించిన విషయంపై కేంద్ర మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఏపీ గవర్నక్‌కు లేఖ రాశారు.

ఏపీలో సమాచార కమిషనర్లుగా మీ చేత నియమించబడిన వారు స్వచ్ఛందంగా తమ ఆస్తులను బహిరంగంగా వెల్లడించాలని ఈ ఏడాది మార్చి 9న మీకు లేఖ రాశాను. అయితే ఇది కేంద్ర సమాచార కమిషన్‌తో ముడిపడిన వ్యవహారం కాబట్టి మీరు.. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర సమాచార కమిషన్‌కు నా విజ్ఞప్తిని తెలియజేశారని ఈఏఎస్ శర్మ ఏపీ గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. నా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని ఏపీ సమాచార ప్రధాన కమిషనర్ మహబూబ్ బాష వెంటనే స్వచ్ఛందంగా తన ఆస్తులను వెల్లడించడాన్ని ప్రశంసిస్తున్నాను అని శర్మ తెలిపారు.

ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహబూబ్ బాష స్వచ్ఛందంగా తన ఆస్తుల వివరాలు వెల్లడించిన స్పూర్తి నిజంగా రాజ్యంగంలోని సమాచార హక్కు చట్టాన్ని మరింత ముందుకు తీసుకొని వెళ్లేలా ఉన్నది. ఈ చట్టం పారదర్శకతను తెలియజేయడమే కాకుండా.. సమాచార హక్కు కమిషన్ యొక్క సుపరిపాలనను సూచిస్తుందని పేర్కొన్నారు. సమాచార హక్కు కమిషన్ రాష్ట్రంలోని అన్ని శాఖల నుంచి ప్రజలకు సరైన సమాచారాన్ని అందించాలనే లక్ష్యంతో ఉన్నది. అంతే కాకుండా ఎవరైనా ఆర్టీఐ దరఖాస్తు చేస్తే సెక్షన్ 6 కింద ముఖ్యమైన సమాచారాన్ని కూడా వెల్లడించాల్సిన అవసరం ఉందని శర్మ లేఖలో పేర్కొన్నారు.

సమాచారాన్ని వెల్లడించే విషయంలో ఏపీ ప్రధాన సమాచార కమిషనర్ మహబూబ్ బాషా ఒక బెంచ్ మార్క్ సృష్టించారని శర్మ ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ శాఖల్లో పని చేసే అధికారులకు ఆయన ఒక మార్గదర్శిగా నిలిచారని చెప్పారు. సమాచార కమిషన్ విశ్వసనీయతను ప్రజల్లో పెంపొందించే విషయంలో నేను సుదీర్ఘంగా పోరాటం చేస్తానని శర్మ హమీ ఇచ్చారు. ప్రతీ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ ఇలాగే తమ ఆస్తులను బహిరంగంగా వెల్లడిస్తే వారి పట్ల విశ్వసనీయత పెరుగుతుందని అన్నారు.

రాష్ట్ర సమాచార కమిషన్‌కు దరఖాస్తు చేసే ప్రతీ ఒక్కరు ఇంగ్లీష్‌‌లో నిపుణులు కాదు. అందుకే ఎవరైనా దరఖాస్తు చేస్తే వారి స్థానిక భాషలో సమాచారం ఇస్తే బాగుంటుందని శర్మ సూచించారు. ఇకపై ఏపీలో ఎవరైనా సమాచార కమిషన్‌కు దరఖాస్తు చేస్తే తెలుగులో తగిన సమాచారం ఇవ్వగలరని శర్మ కోరారు.

ఈఏఎస్ శర్మ ఐఏఎస్ అధికారిగా 1965 నుంచి 2000 వరకు పని చేశారు. ఏపీలో అనేక హోదాల్లో ఆయన పని చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక, విద్యుత్ శాఖలో సెక్రటరీగా కూడా పని చేశారు. రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు అధిపతిగా వ్యవహరించారు. ప్రస్తుతం విశాఖపట్నంలో విశ్రాంత జీవితం గడుపుతున్న శర్మ.. పర్యావరణ పరిరక్షణ, ఎన్నికల వ్యవస్థ సంస్కరణ, దిగువ ఆదాయ వర్గాలకు అవకాశాలు అనే అంశాలపై పని చేస్తున్నారు. ఉత్తరాంధ్రలోని ఆదివాసీల కోసం పలు కార్యక్రమాలు ప్రారంభించారు.

Tags:    
Advertisement

Similar News