గ్యాస్ లీకేజీ ఘటన.. సీడ్స్ కంపెనీ మూసివేత..

విషవాయువు లీకేజీ ఘటనపై ఐసీఎంఆర్ తో విచారణ చేపట్టబోతున్నట్టు తెలిపారు మంత్రి అమర్నాథ్. బాధితుల చికిత్స ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారాయన.

Advertisement
Update:2022-08-03 15:44 IST

అచ్యుతాపురం సెజ్ సీడ్స్ కంపెనీలో విషవాయువు లీకేజీ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు సీడ్స్ కంపెనీ మూసివేయాలని ఆదేశించింది. రెండు నెలల క్రితం ఇదే కంపెనీలో విషవాయువు లీకేజీ ఘటన జరిగింది. అప్పట్లో కమిటీ విచారణలో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు తేలింది. విచారణ కొనసాగుతుండగా మరోసారి ప్రమాదం జరగడం దురదృష్టకరం. తాజా ఘటనలో 121మంది అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ పరామర్శించారు. సీడ్స్ కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూట్ కాజ్ తెలిసే వరకు సీడ్స్ కంపెనీ మూసేయాలని ఆదేశాలిచ్చారు.

విషవాయువు లీకేజీ ఘటనపై ఐసీఎంఆర్ తో విచారణ చేపట్టబోతున్నట్టు తెలిపారు మంత్రి అమర్నాథ్. బాధితుల చికిత్స ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారాయన. రాష్ట్రస్థాయిలో ఉన్న పరిశ్రమలన్నిటిపై సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పెస్టిసైడ్స్ ఫిమిగేషన్ కారణంగా, గ్లోరిఫైర్ పోలిస్ అనే రసాయనం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోందని, అయితే ఇది మానవ తప్పిదమా లేదా అనేది తేలాల్సి ఉందని చెప్పారు మంత్రి అమర్నాథ్.

అస్వస్థతకు గురైనవారందర్నీ ఐదు ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు మంత్రి అమర్నాథ్. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించినట్టు తెలిపారాయన. ప్రస్తుతం జరిగిన దుర్ఘటనలో ఎవరికి ప్రాణాపాయం లేదని, జరిగిన సంఘటన దురదృష్టకరం అని అన్నారు మంత్రి అమర్నాథ్. జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత సీడ్స్ కంపెనీ యాజమాన్యానిదేనని అన్నారు మంత్రి.

Tags:    
Advertisement

Similar News