పేలిన గ్యాస్ సిలిండర్లు.. తృటిలో తప్పిన పెనుముప్పు.. - గుణదలలో క్షణక్షణం భయంభయం
ఊహించని ఈ ఘటనలో మురళి, మణికంఠ స్వల్పంగా గాయపడ్డారు. ఆ వెంటనే ఆ ప్రాంతం నుంచి బయటికి పరుగులు తీశారు. లోపల క్రమంగా పెరిగిన మంటలు.. అక్కడే ఉన్న నూనె, ఇతర ప్లాస్టిక్ కవర్లు. ఇతర సామగ్రికి అంటుకున్నాయి.
విజయవాడ గుణదల ప్రాంతంలోని మెయిన్ రోడ్డులో ఒక్కసారిగా అలజడి.. మెయిన్‌రోడ్డుకు పక్కనే ఉన్న భవనం పైఅంతస్తులో ఒక్కొక్కటిగా వరుసగా పేలిన నాలుగు గ్యాస్ సిలిండర్లు.. పేలుడు తీవ్రతకు ప్రధాన రహదారి పైకి వచ్చి పడిన గది తలుపు చెక్కలు.. ప్రమాద స్థలంలో మరో 25 గ్యాస్ సిలిండర్లు.. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని క్షణక్షణం భయంభయంగా గడిపారు ఆ ప్రాంత ప్రజలు.
విజయవాడ మాచవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుణదల సెంటర్‌లోని ఓ భవనం పై అంతస్తులో నివసిస్తున్న అందవరపు మురళి గత పదేళ్లుగా చాట్ బండి నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగానే ఆదివారం సాయంత్రానికి కావాల్సిన పానీ పూరీలు, ఇతర తినుబండారాలను తన బావమరిది మణికంఠతో కలసి తయారు చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఊహించని ఈ ఘటనలో మురళి, మణికంఠ స్వల్పంగా గాయపడ్డారు. ఆ వెంటనే ఆ ప్రాంతం నుంచి బయటికి పరుగులు తీశారు. లోపల క్రమంగా పెరిగిన మంటలు.. అక్కడే ఉన్న నూనె, ఇతర ప్లాస్టిక్ కవర్లు. ఇతర సామగ్రికి అంటుకున్నాయి. ఆ వేడి ప్రభావానికి అక్కడే ఉన్న నాలుగు గ్యాస్ సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలిపోయాయి. పెద్ద పెద్ద శబ్దాలతో గ్యాస్ సిలిండర్లు పేలిన తాకిడికి ఆ గది తలుపులు విరిగిపోయి ముక్కలు ప్రధాన రహదారి పైకి పడ్డాయి.
ఈ పేలుళ్ల ధాటికి ఎప్పుడూ రద్దీగా ఉండే గుణదల ప్రాంతంలో జనం భయంతో పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసే క్రమంలో ఘటనాస్థలిలో మరో 25 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని జనం టెన్షన్ టెన్షన్‌గా గడిపారు.
ఈ క్రమంలో విద్యుత్ శాఖ అధికారి రాజు విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. ఇంతలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తూ ఆ గదిలోకి వెళ్లి గ్యాస్ సిలిండర్లను బయటికి తరలించారు. అప్పటివరకు ఆ ప్రాంతంలో టెన్షన్ టెన్షన్‌గా గడిపిన స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ గ్యాస్ సిలిండర్లు కూడా పేలి ఉంటే.. పెను ప్రమాదమే జరిగేదని అధికారులు చెబుతున్నారు.
అన్ని గ్యాస్ సిలిండర్లను ఒకేచోట ఉంచడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆరోజు ఉదయమే 20 గ్యాస్ సిలిండర్లను గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది అక్కడికి తెచ్చారని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలిని ఏసీపీ ఖాదర్ వలి, సీఐ ప్రభాకరరావు పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.