చెత్తపన్నుపై మైండ్ గేమ్.. తొలి హామీ అమలైనట్టుగా ప్రచారం
చెత్తపన్ను వసూళ్లను గత ప్రభుత్వమే నిలిపివేసింది. అయితే కొత్తగా ఏర్పడే ప్రభుత్వం దీన్ని సరికొత్తగా రద్దు చేసినట్టు ఎల్లో మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఎన్నికల వేళ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ చల్లిన బురదలో చెత్తపన్ను కూడా ఉంది. సంక్షేమ పథకాలతో ప్రజలకు డబ్బులిస్తున్నా చెత్తపన్నుల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని ఎల్లో మీడియా సపోర్ట్ తో దుష్ప్రచారం సాగించారు. తీరా ఆ పన్ను వసూళ్లను వైసీపీ ప్రభుత్వం ఆపేసినా కూడా తప్పుడు ప్రచారం మాత్రం ఆగలేదు. తీరా ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తున్న వేళ చెత్తపన్ను రద్దయిందని ఎల్లో మీడియా డప్పుకొడుతోంది. కూటమి తొలి హామీ అమలైనట్టుగా కవరింగ్ గేమ్ మొదలు పెడుతోంది.
మౌఖిక ఆదేశాలిచ్చారట..
చెత్తపన్ను వసూళ్లను గత ప్రభుత్వమే నిలిపివేసింది. అయితే కొత్తగా ఏర్పడే ప్రభుత్వం దీన్ని సరికొత్తగా రద్దు చేసినట్టు ఎల్లో మీడియాలో కథనాలు వస్తున్నాయి. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు చెత్తపన్ను వసూలు చేయొద్దని పుర, నగరపాలక సంస్థలకు అధికారులు మౌఖిక ఆదేశాలిచ్చారని అంటున్నారు. ఎన్నికల హామీని టీడీపీ అమలు చేసిందని గుర్తు చేస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) పేరుతో ఇళ్లనుంచి చెత్తను సేకరించే కార్యక్రమం మొదలు పెట్టింది. నామమాత్రపు రుసుము విధిస్తే ప్రజలకు కూడా బాధ్యత ఉంటందని నెలకు రూ.30నుంచి రూ.150వరకు ఫీజు వసూలు చేసింది. పెద్ద ఎత్తున ఈ-ఆటోలు కొనుగోలు చేసింది. తీరా చెత్తపన్ను అమలులోకి వచ్చేసరికి ప్రతిపక్షం రాద్ధాంతం మొదలు పెట్టింది. ఎన్నికల వేళ ఈ గొడవలన్నీ ఎందుకని తాత్కాలికంగా పన్ను వసూళ్లను ఆపేసింది వైసీపీ ప్రభుత్వం. తమ ఆందోళనలతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందంటూ టీడీపీ మళ్లీ డప్పు కొట్టుకోవడం మొదలు పెట్టింది. తీరా ఎన్నికల తర్వాత తామేదో కొత్తగా ఆ పన్ను రద్దు చేశామంటూ మళ్లీ ప్రచారం స్టార్ట్ చేసింది. రాబోయే రోజుల్లో ఈ పథకంపై కూడా కొత్త ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశాలున్నాయి.