ఈ నియోజకవర్గానికి ఇంత డిమాండా?
రానున్న ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గానికి పోటీ చేయడానికి అన్ని పార్టీల నేతలు పోటీపడుతున్నారు. సుమారు 3 లక్షల ఓట్లున్న ఈ నియోజకవర్గంలో కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బీసీలు, ఎస్సీలు, ముస్లింలు, క్షత్రియులు, రెడ్డి, బ్రాహ్మణ ఓటర్ల సంఖ్య కూడా పర్వాలేదు.
అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాల్లో కూడా విచిత్రమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయటానికి ఎక్కువ మంది నేతలు పోటీపడుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదంటే తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురమే. రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుండి పోటీ చేయటానికి అధికార పార్టీ కాకినాడ ఎంపీ వంగా గీత తెగ ప్రయత్నిస్తున్నారు. ఇక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకపోవచ్చనే ప్రచారం తెలిసిందే. అందుకనే 2009లో ఇక్కడి నుండి గెలిచిన వంగా గీత మళ్ళీ ప్రయత్నిస్తున్నారు.
ఇక టీడీపీని తీసుకుంటే మాజీ ఎమ్మెల్యే ఎస్‌విఎస్ఎన్ వర్మ విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పొత్తులున్నా లేకపోయినా తానే పోటీ చేస్తానని ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఇక పొత్తున్నా లేకపోయినా తనకే టికెట్ అని జనసేన నేత శేషుకుమారి ప్రచారం చేసుకుంటున్నారు. వారాహి యాత్రలో భాగంగా పిఠాపురంలో పవన్ మాట్లాడుతూ తానిక్కడే ఆఫీసు ఓపెన్ చేస్తానని, ఇల్లు కూడా ఏర్పాటు చేసుకుంటానని చెప్పారు. శక్తిపీఠం ఆశీర్వాదం ఉంటే ఎమ్మెల్యేగా గెలుస్తానన్నారు. దాంతో పవన్ కూడా పిఠాపురంలోనే పోటీ చేయబోతున్నట్లు ప్రచారం పెరిగిపోయింది.
వీళ్ళంతా సరిపోరన్నట్లు ముద్రగడ పద్మనాభం కూడా తయారయ్యారు. పిఠాపురంలో తనపైన పోటీ చేయాలని పవన్‌కు ముద్రగడ చాలెంజ్ చేశారు. ముద్రగడ పిఠాపురం నియోజకవర్గం ప్రస్తావన ఎందుకు తెచ్చారో అర్థం కావటంలేదు. ఉద్యమ నేత తొందరలోనే వైసీపీలో చేరి పిఠాపురం ఎమ్మెల్యేగానో లేకపోతే కాకినాడ ఎంపీగానో పోటీ చేస్తారనే ప్రచారం అందరికీ తెలిసిందే.
మొత్తానికి ఇన్ని పార్టీల నుండి ఇంతమంది నేతల కన్ను పిఠాపురం నియోజకవర్గం మీద పడటమే చాలా ఆశ్చర్యంగా ఉంది. సుమారు 3 లక్షల ఓట్లున్న ఈ నియోజకవర్గంలో కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బీసీలు, ఎస్సీలు, ముస్లింలు, క్షత్రియులు, రెడ్డి, బ్రాహ్మణ ఓటర్ల సంఖ్య కూడా పర్వాలేదు. అందుకనే ఇక్కడి నుండి కాపు, బ్రాహ్మణ, క్షత్రియ సామాజికవర్గాలకు చెందినవారు ఎమ్మెల్యేలుగా గెలిచారు. మరి 2024లో ఇక్కడి నుండి ఎవరు గెలుస్తారో చూడాలి.