ఏపీలో 'ఉచిత గ్యాస్‌' బుకింగ్‌ ప్రారంభం

ఈ నెల 31న ఉచిత సిలిండర్లను లబ్ధిదారులకు అందజేయనున్న ప్రభుత్వం

Advertisement
Update:2024-10-29 12:31 IST

ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి కానుకగా ఉచిత గ్యాస్‌ సిలండర్ల పథకం కోసం బుకింగ్‌ మొదలైంది. ఆధార్‌, రేషన్‌కార్డు ఉన్న ప్రతీ గ్యాస్‌ వినియోగదారుకూ రూ. 851 రాయితీ రానున్నది. ప్రతి నాలుగు నెలలకొక సిలిండర్‌ చొప్పున ఏటా 2 ఉచిత సిలిండర్లు పంపిణీ చేయనున్నారు.వినియోగదారుడు చెల్లించిన 48 గంటల్లో బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ అవుతుంది. నవంబర్‌, డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు మొదటి సిలిండర్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి.  దీపావళి కానుకగా దీపం-2 పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. తెల్ల రేషన్‌కార్డు దారులు నేటి నుంచి గ్యాస్‌ బుక్‌ చేసుకోవచ్చిన వెల్లడించారు. గ్యాస్‌, ఆధార్‌, రేషన్‌కార్డు, బ్యాంకు ఖాతా ఉంటే పథకానికి అర్హులని మంత్రి స్పష్టం చేశారు. 

ఉచిత సిలిండర్ల పథకం రాయితీ నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్‌ కంపెనీలు, పౌర సరఫరాల శాఖ తెరిచిన ఖాతాలో ఈ నిధులు జమ చేయనున్నారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా ఒక సిలిండర్‌ రాయితీ మొత్తం రూ. 895 కోట్లు విడుదల చేయడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 31న ఉచిత సిలిండర్లను ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయనున్నది. మొత్తం మూడు ఉచిత సిలిండర్లకు గానూ రూ. 2,684 కోట్ల వ్యయమవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఉచిత సిలిండర్‌ నిధులను డీబీటీ ద్వారా జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Tags:    
Advertisement

Similar News