ఓటు హక్కు కోసం పోరాడుతున్నారా?

గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓటు హక్కును నమోదు చేయించుకోవటం కోసం తాను హైకోర్టులో పోరాడుతున్నట్లు చెప్పారు. అసలు నిమ్మగడ్డ ఓటును ఎవరు తొలగించారు? ఎందుకు తొలగించారు? అన్నది అర్ధం కావటం లేదు.

Advertisement
Update:2023-01-15 12:13 IST

వినటానికి కాస్త ఆశ్చర్యంగానే ఉంది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఏపీలో ఓటుహక్కు లేదట. ఐఏఎస్ అధికారిగా దాదాపు 30 ఏళ్ళు వివిధ హోదాల్లో పనిచేసిన నిమ్మగడ్డ చివరగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసి ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. కమిషనర్‌గా ఉన్న‌ప్పుడు స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వంతో ఎన్ని గొడవలయ్యాయో అందరికీ తెలిసిందే. స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం అనుకున్నప్పుడు కరోనా వైరస్ కారణంగా రమేష్ ఎన్నికలను వాయిదా వేశారు.

తర్వాత కరోనా వైరస్ బాగా ఉదృతంగా ఉన్న సమయంలో హఠాత్తుగా ఎన్నికల నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. రమేష్ ప్రకటనతో ప్రభుత్వం విభేదించటంతో చాలా పెద్ద వివాదమైంది. చివరకు ఈ వివాదం సుప్రిం కోర్టు జోక్యంతో కానీ సద్దుమణగలేదు. కమిషనర్‌గా పనిచేసినంత కాలం ప్రతిపక్షాలు ముఖ్యంగా చంద్రబాబునాయుడు చెప్పినట్లుగానే రమేష్ నడుచుకుంటున్నట్లు జగన్మోహన్ రెడ్డి, మంత్రులు ఎన్ని ఆరోపణలు చేశారో అందరికీ తెలిసిందే. చివరకు రమేష్‌ను ప్రభుత్వం తొలగిస్తే కోర్టు కెళ్ళి ఆర్డర్ తెచ్చుకుని కంటిన్యూ అయ్యారు.

అంత వివాదాస్పద అధికారి ఇప్పుడు ఓటు హక్కు కోసం కోర్టులో పోరాడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నిమ్మగడ్డే చెప్పారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓటు హక్కును నమోదు చేయించుకోవటం కోసం తాను హైకోర్టులో పోరాడుతున్నట్లు చెప్పారు. అసలు నిమ్మగడ్డ ఓటును ఎవరు తొలగించారు? ఎందుకు తొలగించారు? అన్నది అర్ధం కావటం లేదు. ఒకరి ఓటును తొలగించాలన్నా లేదా నమోదు చేయాలన్నా సంబంధిత అధికారులే చేయాలి.

అయితే నిమ్మగడ్డ ఉండేదేమో హైదరాబాద్‌లో.. కానీ ఓటు హక్కు కావాలని అనుకుంటున్నదేమో దుగ్గిరాలలో. ఆధార్ కార్డు ప్రకారం నిమ్మగడ్డ శాశ్వత నివాసం ఎక్కడుందో తెలీదు. ఇప్పుడు ప్రతి విషయానికి ఆధార్ కార్డు అడుగుతున్నారు కాబట్టి దుగ్గిరాలలో ఓటర్ల జాబితా సవరణ అప్ డేట్ సందర్భంగా నిమ్మగడ్డ ఓటును అధికారులు తీసేశారేమో. ఏదేమైనా రాష్ట్ర ఎన్నికల అధికారిగా పనిచేసిన నిమ్మగడ్డే ఓటు హక్కు కోసం పోరాడటమంటే ఆశ్చర్యంగానే ఉంది.

Tags:    
Advertisement

Similar News