మార్గదర్శి రామోజీదా.. కాదా..? అనేది తేల్చాలి. - మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్
మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ తనదేనని రామోజీరావు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారని, కానీ మార్గదర్శి సంస్థ రామోజీరావుకు తమ సంస్థతో సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని వివరించారు.
మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ రామోజీరావుదా.. కాదా..? అనే విషయం తేల్చాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ తనదేనని రామోజీరావు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారని, కానీ మార్గదర్శి సంస్థ రామోజీరావుకు తమ సంస్థతో సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని వివరించారు. రాజమహేంద్రవరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉండవల్లి మాట్లాడారు. రామోజీరావు చట్టానికి అతీతుడు కాదనే విషయాన్ని ప్రూవ్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
చిట్‌ఫండ్ వ్యాపారులకు డిపాజిట్లు సేకరించే హక్కు లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అలాగే చిట్‌ఫండ్ సొమ్ముతో వ్యాపారాలు చేయకూడదనేది కూడా ప్రధాన నిబంధన అని చెప్పారు. ఇది రిజర్వు బ్యాంకు చట్టంలో ఉందని ఆయన గుర్తు చేశారు. రామోజీరావు మాత్రం చిట్లు వేసిన వారి సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా తన సొంత వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టారని ఉండవల్లి తెలిపారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చిట్‌ఫండ్ సంస్థల్లో కార్యకలాపాలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను నియమించిందనే వార్తలు వస్తున్నాయని ఆయన చెప్పారు. చిన్న చిన్న చిట్‌ఫండ్ సంస్థలపై పరిశీలన చేసే కంటే.. చిట్‌ఫండ్ వ్యాపారంలో 80 శాతం లావాదేవీలు ఉన్న అతి పెద్ద సంస్థ మార్గదర్శిపై దృష్టి పెట్టాలని ఉండవల్లి కోరారు. ఈ కేసు విషయం తేలకుండా పెద్ద పెద్ద న్యాయవాదులను నియమించుకున్నాడని రామోజీరావుని ఉండవల్లి విమర్శించారు. తాను బతికున్నంత వరకు ఈ కేసు తేలకపోవచ్చని చెప్పారు.