ఏపీలో అన్ని పార్టీల అధ్యక్షులు అగ్రవర్ణాలవారే.. హర్షకుమార్ లాజిక్

ఏపీలో అధికార వైసీపీ అధ్యక్షుడు రెడ్డి, ప్రతిపక్ష టీడీపీ అధినేత కమ్మ, బీజేపీ-కాపు, జనసేన-కాపు, సీపీఎం-రెడ్డి, సీపీఐ-బీసీ.. ఇలా అధ్యక్ష పదవులన్నీ అగ్రకులాలకే దక్కాయని, కాంగ్రెస్ కూడా ఇప్పుడు అదేబాటలో పయనించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు హర్షకుమార్.

Advertisement
Update:2022-11-24 13:04 IST

ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పార్టీల అధ్యక్షులు అగ్రవర్ణాలవారే ఉన్నారని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పంథా ఎంచుకోవడం ఆశ్చర్యంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్. తాజాగా తనకు ఇచ్చిన ప్రచార కమిటీ చైర్మన్ పదవి వద్దని ఆయన అధిష్టానానికి ఈమెయిల్ పంపించారు. ఆ లేఖలోనే ఈ విషయాలన్నీ ఏకరువు పెట్టారు.

ఏపీలో అధికార వైసీపీ అధ్యక్షుడు రెడ్డి, ప్రతిపక్ష టీడీపీ అధినేత కమ్మ, బీజేపీ-కాపు, జనసేన-కాపు, సీపీఎం-రెడ్డి, సీపీఐ-బీసీ.. ఇలా అధ్యక్ష పదవులన్నీ అగ్రకులాలకే దక్కాయని, కాంగ్రెస్ కూడా ఇప్పుడు అదేబాటలో పయనించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు హర్షకుమార్. పీసీసీ అధ్యక్ష పదవి బ్రాహ్మణ వర్గానికి చెందిన గిడుగు రుద్రరాజుకి ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు.

చాలాకాలం తర్వాత..

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలపడింది. అటు తెలంగాణలో కూడా క్రమక్రమంగా ప్రాభవం కోల్పోతోంది. ఈ దశలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జాతీయ స్థాయిలో కాస్త ఆశాజనకంగా మారింది. అందుకే ఏపీలో కూడా కదలిక వచ్చింది. పీసీసీ చీఫ్‌గా గిడుగు రుద్రరాజుని నియమించారు. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలి, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, పి.రాకేశ్ రెడ్డిని నియమించారు. పీసీసీ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్‌గా పళ్లంరాజు, మీడియా కమిటీ చైర్మన్‌గా తులసిరెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్‌గా హర్షకుమార్‌ని నియమిస్తూ పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

చాన్నాళ్ల తర్వాత ఏపీసీసీలో కొత్త నియామకాలతో ఉత్సాహం వచ్చింది. పీసీసీ చీఫ్ రుద్రరాజు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మిగతా నాయకులు కూడా కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నారు. అయితే హర్షకుమార్ మాత్రం అగ్రవర్ణాలకు ఈ పదవి ఎందుకంటూ అధిష్టానానికి లేఖ రాయడంతో కలకలం రేగింది. ఓ దశలో హర్షకుమార్ కూడా పీసీసీ చీఫ్ పదవిని ఆశించారు. అయితే అనూహ్యంగా రుద్రరాజు పేరు తెరపైకి వచ్చింది. హర్షకుమార్‌ని కేవలం ప్రచార కమిటీకి పరిమితం చేశారు. దీంతో ఆయన ఈమెయిల్ అస్త్రం సంధించారు. అసలే పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న ఈ దశలో ఈ అంతర్గత కలహాలేంటి అని అధిష్టానం షాకైంది. మరి బుజ్జగింపులు ఉంటాయో లేదో ముందు ముందు తేలిపోతుంది.

Tags:    
Advertisement

Similar News