రామారావు ఆన్ డ్యూటీ..తప్పని పోటీ
తన పోటీదారులంతా వైసీపీలో ఉండడంతో వచ్చే ఎన్నికల నాటికి టిడిపిలో చేరితే టికెట్ గ్యారంటీ అని, గెలుపు తథ్యం అని భావించిన మాజీ మంత్రి పాలేటి రామారావు పార్టీ మారేందుకు సన్నద్ధమవుతున్నారు. టిడిపిలోని పాత పరిచయాలతో సొంతగూటికి నేడో రేపో చేరతారని టాక్ వినిపిస్తోంది.
ఆయనో మాజీ మంత్రి. ప్రస్తుతం రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేరు. కానీ వార్తల్లో ఉంటారు. ఆయనే పాలేటి రామారావు. మళ్లీ డ్యూటీ ఎక్కాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఏ పార్టీలోకి తాను ఎంటర్ అయితే ఆ పార్టీలోకి తన ప్రత్యర్థులు చేరుతుండడంతో మరో పార్టీ వెతుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన పాలేటి చీరాల నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత రాజకీయ పార్టీల వ్యూహాలు, స్థానిక సమీకరణాలు శరవేగంగా మారిపోతుండడంతో ఎన్నికల సమయంలో డైలమాలో పడుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన మాజీ మంత్రి మళ్లీ సొంతగూటికి చేరాలని విశ్వప్రయత్నం చేస్తున్నారని సమాచారం. టిడిపిలో పాలేటి యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఆమంచి కృష్ణమోహన్ వచ్చి చేరాడు. అనంతపురం నుంచి పోతుల సునీత కూడా టిడిపిలో పనిచేసేందుకు వచ్చింది. టిడిపి టికెట్ తెచ్చుకున్న కరణం బలరాం ఉండనే ఉన్నారు. టిడిపిలో ఇంత పోటీలో తాను ఎలా నెగ్గుకురాగలననే సంకోచంతో వైసీపీలో చేరారు. ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరారు. టిడిపి నుంచి గెలిచిన కరణం బలరాం వైసీపీ గూటి పక్షి అయ్యారు. టిడిపి ఎమ్మెల్సీగా పనిచేసిన పోతుల సునీత పదవికి రాజీనామా చేసి మరీ వైసీపీ కండువా కప్పుకున్నారు. పాపం పాలేటి రామారావు వైసీపీలోనూ గుంపులో గోవింద నాయకుడు అయ్యారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో నేతలతో ఓవర్లోడ్ అవుతుండడం, వర్గపోరుతో సతమతం అవుతుండడం పాలేటి రామారావుకి షరామామూలైపోయింది. తన పోటీదారులంతా వైసీపీలో ఉండడంతో వచ్చే ఎన్నికల నాటికి టిడిపిలో చేరితే టికెట్ గ్యారంటీ అని, గెలుపు తథ్యం అని భావించిన మాజీ మంత్రి పాలేటి రామారావు పార్టీ మారేందుకు సన్నద్ధమవుతున్నారు. టిడిపిలోని పాత పరిచయాలతో సొంతగూటికి నేడో రేపో చేరతారని టాక్ వినిపిస్తోంది. టిడిపిలో ఒక వేళ చేరినా మళ్లీ ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఇన్‌చార్జి కొండయ్య, సీటు ఆశిస్తున్న యడం బాలాజీ, పార్టీలో చేరి చీరాల నుంచి బరిలోకి దిగుతాడనుకుంటోన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు హితేష్ నుంచి కూడా మళ్లీ పాలేటి రామారావుకి పోటీ తప్పదు. ఇటీవలే తన మరణ దిన వేడుకలను చీరాల ఐఎంఏ హాల్‌లో నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాలేటి రామారావు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.