పొలిటికల్ క్రాస్‌రోడ్స్‌లో మాజీ మంత్రి బాలినేని?
సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి నచ్చజెప్పినా బాలినేని వినలేదు. తనకు, తన కుమారుడికి ఒంగోలులో సీట్లు కావాలనే డిమాండ్‌ను పదేపదే వినిపించారు.
మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయంగా క్రాస్ రోడ్స్‌లో నిలబడ్డారు. వైసీపీ అధిష్టానం ఎంత చెప్పినా వినకుండా మొండిపట్టు పట్టి ఆ పార్టీతో తెగతెంపులు చేసుకోవడానికే సిద్ధమయ్యారు. తనకు ఒంగోలు అసెంబ్లీ, మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఒంగోలు ఎంపీ సీటు కావాలని బాలినేని పట్టుబట్టాడు. అందుకు జగన్ ససేమిరా అనడంతో ప్రత్యామ్నయంగా తన కుమారుడు ప్రణీత్‌రెడ్డి పేరును ఎంపీ అభ్యర్థిగా తెరపైకి తెచ్చారు. అయితే దాన్నీ ఒప్పుకోని వైసీపీ గిద్దలూరు వెళ్లాలని బాలినేనికి సూచించడంతో ఆయన అలకబూనారు.
సజ్జల వచ్చి నచ్చజెప్పినా వినలేదు
వైసీపీలో మీ ప్రాధాన్యం ఏమీ తగ్గదని సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి నచ్చజెప్పినా బాలినేని వినలేదు. తనకు, తన కుమారుడికి ఒంగోలులో సీట్లు కావాలనే డిమాండ్‌ను పదేపదే వినిపించారు. ఒంగోలు ఎంపీ సీటును చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించిందని సజ్జల చెప్పడంతో ఇక తనకు వైసీపీకీ బంధం తెగిపోయినట్లేనని బాలినేని నిశ్చయించుకున్నారు.
సైకిల్ ఎక్కుతారా?
భవిష్యత్తు కార్యాచరణపై తన కుమారుడు ప్రణీత్‌రెడ్డి, వియ్యంకుడు భాస్కర్‌రెడ్డితో బాలినేని చర్చలు జరుపుతున్నారు. వైసీపీలో తన మాట చెల్లని నేపథ్యంలో ఎంపీ మాగుంటతో కలిసి వేరు దారి చూసుకోవాలని బాలినేని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే తెలుగుదేశంలోకి వెళ్తారా? జనసేన లోకి వెళ్తారా? లేదంటే కాంగ్రెస్‌లోకి వెళ్తారా అనేది మాత్రం ఇప్పుడు సస్పెన్స్‌గా ఉంది.