పోలవరం ప్రాజెక్టును ముంచింది చంద్రబాబే - అంబటి

చంద్రబాబు అందుకు భిన్నంగా చేశారని చెప్పుకొచ్చారు. ఒకేసారి ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణంతో పాటు డయాఫ్రమ్‌ వాల్, రివర్ డైవర్షన్ పనులు చేపట్టారని గుర్తుచేశారు.

Advertisement
Update: 2024-06-18 13:36 GMT

పోలవరం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. జగన్ తప్పిదాల వల్లే పోలవరం ఆలస్యం జరిగిందని చంద్రబాబు చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. జగన్‌ హయాంలో ఏవిధమైన తప్పిదం జరగకపోగా.. ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయన్నారు. 2019కి ముందు పోలవరం పూర్తి చేశాకే ఎన్నికలకు వెళ్తామని తెలుగుదేశం నేతలు చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు అంబటి.



చంద్రబాబు చేసిన పొరపాట్ల వల్లే ప్రాజెక్టుకు ఈ పరిస్థితి దాపురించిందన్నారు అంబటి రాంబాబు. వాస్తవానికి ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం పూర్తి చేసిన తర్వాతే డయాఫ్రమ్‌ వాల్ నిర్మించాలన్నారు. కానీ చంద్రబాబు అందుకు భిన్నంగా చేశారని చెప్పుకొచ్చారు. ఒకేసారి ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణంతో పాటు డయాఫ్రమ్‌ వాల్, రివర్ డైవర్షన్ పనులు చేపట్టారని గుర్తుచేశారు. కాఫర్‌ డ్యాం పనులు అసంపూర్తిగా చేయడం వల్ల తర్వాతి కాలంలో వచ్చిన వరదలకు డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోయిందన్నారు. దానివల్లే ప్రాజెక్టుకు తీవ్రం నష్టం జరిగిందన్నారు. టీడీపీ హయాంలోనే 72 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని చెప్పడం పచ్చి అబద్ధమన్నారు అంబటి.


చంద్రబాబుకు ప్రజలు మంచి అవకాశం ఇచ్చారని.. ఇలాంటి అవకాశాన్నే గతంలో జగన్‌ కోరుకున్నారన్నారు అంబటి రాంబాబు. ఏపీతో పాటు దేశ ప్రజలు సైతం చంద్రబాబుకు అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. చంద్రబాబుపై ఆధారపడేలా మోదీకి తక్కువ సీట్లు వచ్చాయన్నారు. గతంలోలాగా ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట దీక్షలు చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదన్నారు అంబటి. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలని చంద్రబాబును కోరారు. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలన్నారు. లేకపోతే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారన్నారు అంబటి.

Tags:    
Advertisement

Similar News