క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరిక
రాజకీయాల్లో ప్రవేశించిన రాయుడు ఈ సందర్భంగా తన లక్ష్యాలను కూడా వివరించారు. తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పని చేస్తానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
ఇటీవల కాలంలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ప్రముఖ అంతర్జాతీయ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు గురువారం వైసీపీలో చేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాయుడు వైసీపీలో చేరారు. ఆయనకు సీఎం జగన్ స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు.. వైసీపీలో చేరిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. రాజకీయాలతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించానని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. తొలి నుంచి తనకు సీఎం వైఎస్ జగన్‌పై మంచి అభిప్రాయం ఉందని, కులమతాలు, రాజకీయాలకు అతీతంగా ఆయన పారదర్శకంగా పాలన అందిస్తున్నారని కొనియాడారు. అందుకే ఆయనకు మద్దతుగా తాను గతంలో ట్వీట్లు పెట్టానని గుర్తుచేశారు.
రాజకీయాల్లో ప్రవేశించిన రాయుడు ఈ సందర్భంగా తన లక్ష్యాలను కూడా వివరించారు. తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పని చేస్తానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ గతంలో చాలా ఆరోపణలు చేశారని, ఇప్పుడు వారే అంతకంటే ఎక్కువ ఇస్తామని ఎలా చెబుతారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే గత కొంతకాలంగా అంబటి రాయుడు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పర్యటించిన విషయం తెలిసిందే.