జనసేన తొలి టికెట్ ఖరారు.. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ..
తెనాలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు నాదెండ్ల మనోహర్. అంతకు ముందు ఆయన తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు కూడా తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల టైమ్ ఉంది. విపక్షాలన్నీ ఐక్యంగా పోటీ చేయాలనుకుంటున్నా పొత్తులు ఇంకా ఖరారు కాలేదు. ఎవరికి ఎన్ని సీట్లు, ఎవరెవరు ఎక్కడ్నుంచి పోటీ చేస్తారనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. ఈ సందర్భంలో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాత్రం తాను తెనాలి నుంచి పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో తాను తెనాలి నుంచి బరిలో దిగుతానన్నారు. ఈసారి కచ్చితంగా విజయం తనదేనంటున్నారాయన.
తెనాలి నియోజకవర్గం కొల్లిపరలో పర్యటించిన నాదెండ్ల మనోహర్.. మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. తన హయాంలో తెనాలిలో జరిగిన అభివృద్ధిని గుర్తుచేశారు. తెనాలి నుంచి తాను గెలిచిన తర్వాత మళ్లీ మంచి రోజులొస్తాయని స్థానికులకు భరోసా ఇచ్చారు.
తెనాలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు నాదెండ్ల మనోహర్. అంతకు ముందు ఆయన తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు కూడా తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో కాంగ్రెస్ తరపున తెనాలినుంచి పోటీ చేసి ఓడిపోయారు మనోహర్. తర్వాత జనసేనలో చేరి 2019లో మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి మాత్రం గెలిచి తీరతానంటున్నారు. 2019లో తెనాలిలో టీడీపీ, జనసేన, వైసీపీ మధ్య త్రిముఖ పోరు జరిగింది. నాదెండ్ల మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.
జనసేనాని ఎక్కడినుంచి..?
2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక.. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు పవన్ కల్యాణ్. ఈసారి ఆయన తిరుపతికి మారిపోతారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఇంకా పవన్ పోటీ చేసే నియోజకవర్గం మాత్రం ఫైనల్ కాలేదు. ఈలోగా నాదెండ్ల మనోహర్ తన నియోజకవర్గాన్ని ఖరారు చేసుకున్నారు. తెనాలి నుంచే పోటీ అంటున్నారు. అంటే పొత్తులు పెట్టుకున్నా ఈ సీటు మాత్రం తనకు త్యాగం చేయాల్సిందేనని ఆయన పరోక్షంగా టీడీపీ, బీజేపీకి హింట్ ఇచ్చేశారు.