భారీగా తగ్గిన ధరలు.. టమాటా రైతుల కష్టాలు
చిత్తూరు, అనంతపురం జిల్లాలనుంచి అధిక దిగుబడి రావడం వల్లే టమాటా ధరలు భారీగా పడిపోతున్నాయని కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ వ్యాపారులు అంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ ధర మరింత తగ్గే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
ఆల్ టైమ్ రికార్డ్ ధరలతో ఈ ఏడాది టమాటా రైతులు పండగ చేసుకున్నారు. భారీగా లాభాలు కళ్లజూశారు. గతంలో చేసిన అప్పులన్నీ తీర్చేసుకున్నారు. టమాటా రైతు అంటే సమాజంలో అదో గౌరవం అన్నట్టుగా మారింది పరిస్థితి. కూరగాయల దుకాణాల దగ్గర కూడా బౌన్సర్లను పెట్టుకున్న పరిస్థితి చూశాం. కానీ, రోజులు మారాయి. టమాటా ధరలు భారీగా పతనం అవుతున్నాయి. కేజీ రూ.240 వరకు పలికిన ధర ఇప్పుడు హోల్ సేల్ మార్కెట్లో 10రూపాయలకు పడిపోయింది. టమాటా రైతులు కన్నీరు పెడుతున్నారు.
గిట్టుబాటు ధర కూడా లేదు..
కేజీ 240 రూపాయలు ఉన్నప్పుడు గరిష్ట ధరతో టమాటా రైతులు లాభాల పంట పండించారు. అదే ఊపులో మరికొంతమంది కూడా టమాటా సాగులో దిగారు. దీంతో దిగుబడి పెరిగి, మార్కెట్ లో సరుకు ఎక్కువైంది. అటు వర్షాలు కూడా తగ్గడంతో రవాణా కూడా పెరిగింది. ఇప్పుడు రేట్లు తగ్గిపోయాయి. హోల్ సేల్ మార్కెట్లో కేజీ 10రూపాయలకు పడిపోయింది. వినియోగదారుల దగ్గరకొచ్చే సరికి కేజీ 20నుంచి 25 రూపాయలు పలుకుతోంది. ఈ రేటుతో కస్టమర్లు హ్యాపీ. కానీ, రైతులు మాత్రం కష్టపడుతున్నారు. కనీసం గిట్టుబాటు ధర కూడా లేదంటూ వాపోతున్నారు.
చిత్తూరు, అనంతపురం జిల్లాలనుంచి అధిక దిగుబడి రావడం వల్లే టమాటా ధరలు భారీగా పడిపోతున్నాయని కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ వ్యాపారులు అంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ ధర మరింత తగ్గే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. అదే నిజమైతే అధిక ధరలతో టమాటా సాగు మొదలు పెట్టిన రైతులు పంట చేతికొచ్చే సమయానికి ధరలు పతనమై మరింత ఇబ్బంది పడటం ఖాయం.
*