విశాఖకు అమెజాన్
Amazon company in Vizag: ఈ విషయాన్ని ఎస్‌టీపీఐ విశాఖ డైరెక్టర్ రామ్ ప్రసాద్ ధృవీకరించారు. సంస్థ ఏర్పాటుకు ఇప్పటికే ప్రాథమిక అనుమతుల మంజూరు కూడా జరిగిందన్నారు.
చంద్రబాబు చేసిన ఒక పొరపాటు కారణంగా విశాఖపట్నం ఐటీ రంగంలో అనేక అవకాశాలు కోల్పోయిందన్న విమర్శ ఉంది. రాష్ట్ర విభజన తర్వాత విశాఖలో యూనిట్లు ఏర్పాటు చేసేందుకు అనేక ప్రముఖ ఐటీ కంపెనీలు ముందుకు రాగా.. ఇక్కడ వద్దు.. అమరావతితో ఏర్పాటు చేయండి అంటూ నాటి ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చారు. దాంతో బీడు భూములు తప్ప ఏమీ లేని అమరావతిలో యూనిట్లు స్థాపించడం ఇష్టం లేక అనేక కంపెనీలు పక్క రాష్ట్రాలను చూసుకున్నాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ విషయంలో ఐటీ కంపెనీలకు నమ్మకం కలిగించే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా విశాఖలో సంస్థ ఏర్పాటుకు ప్రముఖ ఐటీ సంస్థ అమెజాన్ ముందుకొచ్చింది. విశాఖలో సిస్టమ్ సాప్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్, ఐటీ ఆధారిత సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని అమెజాన్ ముందుకొచ్చింది. ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నట్టు సాప్ట్‌వేర్ టెక్నాలజీ ఫార్మ్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ) ప్రకటించింది.
ఈ విషయాన్ని ఎస్‌టీపీఐ విశాఖ డైరెక్టర్ రామ్ ప్రసాద్ ధృవీకరించారు. సంస్థ ఏర్పాటుకు ఇప్పటికే ప్రాథమిక అనుమతుల మంజూరు కూడా జరిగిందన్నారు. తొలిదశలో 120 సీటింగ్ సామర్థ్యంతో డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారని ఆయన వివరించారు. దశలవారీగా విస్తరణ చేబడుతామని కంపెనీ వెల్లడించిందన్నారు. అమెజాన్ లాంటి సంస్థ రాకతో ఇతర సంస్థల్లోనూ విశాఖలో యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి పెరుగుతుందన్నారు. ఇప్పటికే విశాఖలో ఇన్ఫోసిస్, రాండ్‌స్టాడ్ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.