ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిపై ఉత్కంఠ..తెరపైకి కొత్త పేరు!
ఏపీ సీఎస్ గా జవహర్ రెడ్డి నియామాకం దాదాపుగా ఖాయమైందని అంతా అనుకున్నారు.అయితే ఒక్కసారిగా సీఎస్ రేసులో మరో ఐఏఎస్ గిరిధర్ అర్మాణే పేరు తెరపైకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాని కార్యదర్శి(సీఎస్) పదవిలోకి ఎవరు వస్తారనే విషయమై ఉత్కంఠ కొనసాగుతోంది.. ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో కొత్త సీఎస్ ఎంపికపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిన్నటి వరకు సీనియర్ ఐఏఎస్, ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడైన జవహర్ రెడ్డి నియామాకం దాదాపుగా ఖాయమైందని అంతా అనుకున్నారు.
అయితే ఒక్కసారిగా సీఎస్ రేసులో మరో ఐఏఎస్ గిరిధర్ అర్మాణే పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా వున్న గిరిధర్.. శనివారం సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ఏపీ కేడర్‌లోని సీనియర్ ఐఏఎస్‌ల జాబితాలో గిరిధర్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నారు. ఆయన 1988 బ్యాచ్ ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి. వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఆయన పదవీకాలం వుంది. ఈ నేపథ్యంలో జగన్‌తో గిరిధర్ భేటీ కావడం ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
అంతకు ముందు మరో సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి పేరు కూడా వినిపించినా జవహర్ రెడ్డి ఎంపిక ఖాయం అనుకున్నారు. కాగా, ప్రస్తుత సిఎస్ సమీర్ శర్మ పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ యేడాది మే నెలలో కేంద్రం పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ పొడిగింపు నవంబర్ 30తోముగుస్తుంది.