కేతిరెడ్డి నిజాలే చెబుతున్నారా..? వైరల్ అవుతున్న వీడియో
సినిమా టికెట్ల రేట్లు తగ్గించాలని జనం ఎవరూ జగన్ ని అడగలేదని, కానీ తనకు తానే తగ్గించి ఆయన సినిమావాళ్లకు దూరమయ్యారని చెప్పుకొచ్చారు కేతిరెడ్డి.
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పార్టీ గురించి ఆయన ఎక్కడా వ్యతిరేకంగా మాట్లాడలేదు కానీ, గత ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని ధైర్యంగా ఎత్తి చూపారు. సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు దగ్గర్నుంచి, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనే స్లోగన్ వరకు.. అన్నిటిపై సూటిగా, స్పష్టంగా మాట్లాడారు. జగన్ మంచి అనుకున్నదే, ఆయన్ను ముంచేసిందని అన్నారు. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని సూచించారు కేతిరెడ్డి.
వైసీపీ ఓటమి తర్వాత పార్టీ విషయంలో మొదటగా ఘాటు వ్యాఖ్యలు చేసింది కేతిరెడ్డి మాత్రమే. ఆ తర్వాత ఆయన పులివెందుల వెళ్లి నేరుగా జగన్ ని కలసి వచ్చారు. ఇప్పటికీ ఆయన తన అసంతృప్తిని సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నారు. సినిమా టికెట్ల రేట్లు తగ్గించాలని జనం ఎవరూ జగన్ ని అడగలేదని, కానీ తనకు తానే తగ్గించి ఆయన సినిమావాళ్లకు దూరమయ్యారని చెప్పుకొచ్చారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలు అని చెబుతుండే సరికి మిగతా వర్గాలు జగన్ కి వ్యతిరేకంగా మారాయని అన్నారు. పోనీ జగన్ బాగా నమ్మిన ఆయా వర్గాలయినా ఆయనకు అండగా ఉండలేదన్నారు కేతిరెడ్డి.
తొందరేముంది.. టైమ్ ఇద్దాం
తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి పథకాలు అమల చేస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పారని, కూటమి ప్రభుత్వానికి సంపద సృష్టించే అవకాశం ఇద్దామని అన్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. ముందుగానే విమర్శలు చేయడం, గగ్గోలు పెట్టడం సరికాదన్నారు. ఇంత తక్కువ సమయంలోనే అద్భుతాలు జరిగిపోతాయని భావించడం మూర్ఖత్వం అని అన్నారు.
అయితే కేతిరెడ్డి ఇంటర్వ్యూలో కొంత భాగాన్ని సాక్షి మీడియా హైలైట్ చేస్తే, తమకు కావాల్సినదాన్ని మాత్రమే టీడీపీ అనుకూల ప్రసారం చేస్తోంది. మొత్తానికి కేతిరెడ్డి వీడియోని ఇరు వర్గాలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి.