సిగ్గుపడాల్సిన పనిలేదు.. తలెత్తుకు తిరుగుదాం -రోజా
మంచి చేసినా కూడా వైసీపీ ఓడిపోయిందని, ప్రజల గొంతుకై ప్రతిధ్వనించడానికి తాను బయటకు వస్తున్నానంటూ రోజా హింటిచ్చారు.
వైసీపీ ఓటమి తర్వాత ఒక్కొకరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఎన్నికల సమయంలో వైరి వర్గాలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన నేతలంతా కాస్త నిదానంగా బయటకు వస్తున్నారు. కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికే మీడియా ముందుకొచ్చారు. అంబటి రాంబాబు, రోజా.. ఇలా మరికొందరు బయటకు రావాల్సి ఉంది. ఈ క్రమంలో రోజా సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. తాజాగా ఆమె వేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి కానీ, వైసీపీ ప్రభుత్వం మంచి చేసి ఓడిపోయిందని.. దానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు రోజా. "మనం చెడు చేయలేదు కాబట్టి, గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం" అని నాయకులకు ఉపదేశమిస్తున్నారామె. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దామని చెప్పారు. అంటే త్వరలో మీడియా ముందుకొచ్చేందుకు ఆమె గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారనే విషయం ఇక్కడ స్పష్టమైంది. మంచి చేసినా కూడా వైసీపీ ఓడిపోయిందని, ప్రజల గొంతుకై ప్రతిధ్వనించడానికి తాను బయటకు వస్తున్నానంటూ రోజా హింటిచ్చారు.
ఆ ప్రశ్నలకు సమాధానం ఉందా..?
ఇటీవల మీడియా ముందుకొచ్చిన అనిల్ కుమార్ యాదవ్ కొన్ని ప్రశ్నలకు సూటిగా సమాధానమిచ్చారు. రాజకీయ సన్యాసంపై తన సవాల్ ని టీడీపీలో ఎవరూ స్వీకరించలేదని, అందువల్ల ఆ ప్రస్తావనే లేదని తేల్చి చెప్పారు. ఇక మంత్రుల నోటిదూల అనే విషయాన్ని ఆయనే ప్రస్తావించారు. తప్పులుంటే సరిదిద్దుకుంటామని కూడా చెప్పారు. పవన్ కల్యాణ్ ని అసెంబ్లీ గేటు తాకనివ్వబోనని సవాల్ విసిరింది తాను కాదని క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో రోజాకి కూడా మీడియా నుంచి పలు ప్రశ్నలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆమెపై దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఏదేమైనా ఓటమి తర్వాత కొన్నిరోజులు ఇలాంటి విమర్శలు సహజం. వాటన్నిటినీ తట్టుకుని ధైర్యంగా ముందుకెళ్లేందుకు వైసీపీ నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.