వైసీపీపై అసంతృప్తి.. క్లారిటీ ఇచ్చేసిన రోజా
ట్విట్టర్ బయోలో వైసీపీకి సంబంధించిన వివరాలను రోజా తొలగించారని, గతంలో జగన్‌తో ఉన్న ఫోటోను సైతం రోజా తీసేశారని దీంతో ఆమె వైసీపీకి రాజీనామా చేయడం ఖాయమేనని ప్రచారం మొదలైంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ కీలక నేతలంతా సైలెంట్ అయ్యారు. మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు సైతం నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. ఓటమి నుంచి ఇంకా తేరుకోని పలువురు నేతలు పార్టీ కార్యక్రమాల్లో అంటిముట్టనట్లుగా పాల్గొంటున్నారు. మాజీ మంత్రి, ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రోజా సైతం కొద్దిరోజులుగా సైలెంట్ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే రోజా గురించి రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి.
రోజా వైసీపీకి రాజీనామా చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కొన్ని ప్రధాన మీడియా సంస్థలు సైతం వైసీపీకి రోజా రాజీనామా అంటూ వార్తలు రాశాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వదిలి హీరో విజయ్ స్థాపించిన తమిళ్ వెట్రి కళగం ద్వారా రోజా తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్‌పై రోజా అసంతృప్తితో ఉన్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. ట్విట్టర్ బయోలో వైసీపీకి సంబంధించిన వివరాలను రోజా తొలగించారని, గతంలో జగన్‌తో ఉన్న ఫోటోను సైతం రోజా తీసేశారని దీంతో ఆమె వైసీపీకి రాజీనామా చేయడం ఖాయమేనని ప్రచారం మొదలైంది.
ఈ ప్రచారంపై ఇప్పటివరకూ నేరుగా స్పందించకపోయినప్పటికీ.. పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు రోజా. ఇవాళ మాజీ సీఎం జగన్, భారతిలకు ట్విట్టర్ వేదికగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నేళ్లు గడిచినా చెదరని మీ అనుబంధం, ఇలాగే కలకాలం కొనసాగాలని ఆశిస్తూ.. హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలంటూ విష్ చేశారు రోజా. దీంతో జగన్‌పై రోజా అసంతృప్తితో ఉన్నారని జరుగుతున్న ప్రచారంతో పాటు పార్టీని వీడుతారన్న ఊహగానాలకు రోజా చెక్‌పెట్టినట్లయింది.
2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి నగరి నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు రోజా. 2022 నుంచి 2024 మధ్య జగన్ కేబినెట్‌లో మంత్రిగానూ వ్యవహరించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో ఓటమి పాలయ్యారు.