విశాఖ భవిష్యత్ ఇలానే ఉండబోతుందా!
ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. ఎర్రమట్టి దిబ్బల్లో జరిగిన తవ్వకాల దగ్గర సెల్ఫీ తీసుకుని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
దేశంలోని భౌగోళిక వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తింపు పొందిన విశాఖజిల్లాలోని ఎర్రమట్టి దిబ్బల తవ్వకం ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. రుషికొండను తవ్వేశారంటూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన వెంటనే.. సహజసిద్ధంగా ఏర్పడిన, అత్యంత అరుదైన ఎర్రమట్టి దిబ్బలను అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. ప్రొక్లెయినర్లతో తవ్వుతూ టిప్పర్ లారీల్లో పెద్ద ఎత్తున ఎర్రమట్టిని తరలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి.
ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. ఎర్రమట్టి దిబ్బల్లో జరిగిన తవ్వకాల దగ్గర సెల్ఫీ తీసుకుని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చి 43 రోజులే.. కూటమి అధికారంలోకి వచ్చిన 35 రోజుల్లోనే ఎర్రమట్టి దిబ్బల పరిస్థితి ఇది. ప్రభుత్వ పెద్దల సహకారం, స్థానిక నాయకుల మద్దతుతోనే ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు గుడివాడ అమర్‌నాథ్. కూటమి పాలనలో విశాఖ భవిష్యత్ ఎలా ఉండబోతుందో చెప్పకనే చెబుతున్నారంటూ ట్వీట్ చేశారు.
రుషికొండ విషయంలో గత ప్రభుత్వంపై టీడీపీ నేతలు, జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఎర్రమట్టి దిబ్బల విషయంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఇప్పటివరకూ స్పందించలేదు. ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై పర్యావరణ నిపుణులు, ప్రకృతి ప్రేమికులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రమట్టి దిబ్బలు విశాఖపట్నం, భీమిలి మధ్య 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. పర్యాటకంగానూ ఎంతో పేరు గాంచాయి. దక్షిణాసియాలో మరో రెండు ప్రాంతాల్లో మాత్రమే ఈ తరహా ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి.