హైదరాబాద్ సెంట్రలైజ్డ్ ఏరియా.. అందుకే అక్కడ ప్రెస్ మీట్ పెట్టా
మద్యంపై ఆదాయాన్ని చూపించి అప్పులు చేశారంటున్న విమర్శలకు కూడా బుగ్గన సమాధానమిచ్చారు. ఆ అప్పులతో తామేమీ తప్పులు చేయలేదని, పథకాలు అమలు చేశామని అన్నారు.
సూపర్ సిక్స్ కొట్టబోయి తొలి ఓవర్ లోనే సీఎం చంద్రబాబు డకౌట్ అయ్యారని అన్నారు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఈరోజు హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన.. ఆర్థిక వ్యవహారాలపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంపై వివరణ ఇచ్చారు. సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. దాదాపుగా జగన్ నిన్న ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలనే ఈరోజు బుగ్గన రిపీట్ చేశారు.
మద్యంపై ఆదాయాన్ని చూపించి అప్పులు చేశారంటున్న విమర్శలకు కూడా బుగ్గన సమాధానమిచ్చారు. ఆ అప్పులతో తామేమీ తప్పులు చేయలేదని, పథకాలు అమలు చేశామని అన్నారు. ఆ పథకాలు అమలు చేయడానికే అప్పులు చేశామని వివరించారు. తాము తీసుకొచ్చిన ‘గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్’ (జీపీఎస్) ను ఇప్పుడు దేశమంతా అమలు చేయాలని కేంద్రం ఆలోచన చేస్తోందన్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే.. పథకాలకు కేటాయింపులు, రాష్ట్ర అప్పులతో సహా, అన్ని వివరాలు ప్రకటించాల్సి ఉంటుందని.. అందుకే చంద్రబాబు భయపడ్డారని, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి వెళ్తున్నారని కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఎందుకంటే..?
అంతా బాగానే ఉంది కానీ ఏపీ మాజీ మంత్రి బుగ్గన హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టడమేంటని చాలామంది లాజిక్ తీస్తున్నారు. ఏపీ నాయకులు హైదరాబాద్ లో ఉండటం తప్పుకాదు, బెంగళూరు వెళ్లడం అంతకంటే తప్పు కాదు, కానీ గతంలో వైసీపీ నాయకులు వేసిన ప్రశ్నల్నే ఇప్పుడు టీడీపీ కాస్త స్వరం పెంచి అడుగుతోంది. హైదరాబాద్ లో ఉండేవారు నాన్ లోకల్ లీడర్లంటూ గతంలో వైసీపీ నేతలు ఓ రేంజ్ లో విమర్శలు చేశారు. చిన్న జ్వరం వస్తేనే పిఠాపురం వదిలేసి హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆ ప్రశ్నలకు ఇప్పుడు బుగ్గన వివరణ ఇవ్వాల్సి వచ్చింది. హైదరాబాద్ సెంట్రలైజ్డ్ ఏరియా అని, వ్యక్తిగత పనులమీద, ఆస్పత్రి పనులమీద ఇక్కడకు అందరం వస్తుంటామని, అలా తాను ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నానని, విజయవాడ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టే వీలు లేక హైదరాబాద్ లో పెట్టానని అన్నారు.