ఆ ఫోన్ భారతిరెడ్డి దగ్గరే ఉంటుంది -ఆదినారాయణరెడ్డి.. అసలెవరీ నవీన్ ?
సానుభూతి ఉంటే ఓట్లు ఎంత స్థాయిలో అధికంగా వస్తాయో.. తండ్రి చనిపోయిన తర్వాత జగన్ కళ్లారా చూశారని.. అందుకే మొన్నటి ఎన్నికల్లోనూ సానుభూతిపరంగానూ ఇది కలిసి వస్తుందని వివేకాను హత్య చేయించారన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జగన్, భారతిరెడ్డిల ప్రోత్సాహంతోనే జరిగిందని ఆరోపించారు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి. తిరిగి దాన్ని తమలాంటి వారిపై మోపే ప్రయత్నం చేశారన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జగన్‌కు తెలిసే జరిగిందని.. అందుకే హత్య జరిగిన వెంటనే అక్కడికి వెళ్లి నెత్తుడి మరకలు తుడిపేశారని.. ఆ తర్వాత గుండెపోటు అంటూ ప్రచారం చేశారని ఆదినారాయణరెడ్డి వివరించారు. హత్యతో సంబంధం లేకపోతే శవానికి కుట్లు ఎందుకు వేయించారని ప్రశ్నించారు. జగన్, భారతి ప్రమేయం లేకుండా వివేకానందరెడ్డికి చంపేంత సాహసం వీరు చేసే అవకాశమే లేదన్నారు ఆదినారాయణరెడ్డి.
హత్య జరిగిన రోజు సీనియర్ ఎన్టీఆర్‌ను మించి జగన్ నటించారని.. ఇది ముమ్మాటికి హత్యే అంటూ ఎక్కడెక్కడ ఎలా నరికారో కూడా వివరించారని గుర్తు చేశారు. 2014లోనూ భారతి ఒత్తిడి కారణంగానే తన మేనత్త కుమారుడైన అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ దక్కిందన్నారు. రెండోసారీ అవినాష్‌కు టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుపట్టిన వ్యక్తే భారతి రెడ్డి అని ఆదినారాయణరెడ్డి చెప్పారు.
సానుభూతి ఉంటే ఓట్లు ఎంత స్థాయిలో అధికంగా వస్తాయో.. తండ్రి చనిపోయిన తర్వాత జగన్ కళ్లారా చూశారని.. అందుకే మొన్నటి ఎన్నికల్లోనూ సానుభూతిపరంగానూ ఇది కలిసి వస్తుందని వివేకాను హత్య చేయించారన్నారు. హత్య జరిగిన రోజు నవీన్ అనే వ్యక్తి ఫోన్ ద్వారా అవినాష్ రెడ్డితో భారతి మాట్లాడినట్టు చెబుతున్నారని.. కానీ ఆ ఫోన్ ఏమీ నవీన్ దగ్గర ఉండదన్నారు. ఫోన్ వచ్చిన ప్రతిసారి అతడొచ్చు వీరికి ఫోన్ ఇవ్వడం జరగదన్నారు. కేవలం తమ పేరున కాకుండా నవీన్ పేరు మీద సిమ్ తీసుకుని ఉంటారని.. ఆ ఫోన్ మాత్రం వీరి దగ్గరే ఉంటుందన్నారు. అసలు ఫోన్ తీసుకుని వచ్చి ఇవ్వడానికి రాత్రి ఒంటి గంట సమయంలో జగన్ ఇంటిలోనే నవీన్ ఎందుకుంటారని ఆదినారాయణరెడ్డి ప్రశ్నించారు.
జగన్, భారతిరెడ్డిని వేరు చేసి చూడటం సాధ్యం కాదని.. వారిద్దరూ అపూర్య జంట అని వ్యాఖ్యానించారు. మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమాలో విలన్ పాత్ర పోషించిన ప్రకాశ్ రాజ్, సరిత దంపతుల అనుబంధం లాంటిదే వీరి మధ్య ఉందన్నారు ఆదినారాయణరెడ్డి. జగన్ ఎలాంటి వ్యక్తో.. వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో తొలుత పులివెందుల ప్రజలకు, ఆ తర్వాత కడప జిల్లా ప్రజలకు అర్థమైందని.. ఇప్పుడు రాష్ట్రం మొత్తం అర్థమై పక్క రాష్ట్రంలోనూ చర్చ జరుగుతోందన్నారు. వివేకానందరెడ్డి హత్య వ్యవహారం ఆ రోజు వైసీపీకి ఎంత సానుకూలతను తెచ్చిపెట్టిందో.. వచ్చే ఎన్నికల్లో అంతే వ్యతిరేకతను తెచ్చిపెట్టబోతోందని ఆదినారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు.
అసలెవరీ నవీన్?
సీబీఐ విచారణలో అవినాష్ రెడ్డి ఇచ్చిన వివరాలతో నవీన్ అనే వ్యక్తికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. దీంతో నవీన్ ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. నవీన్‌ది కూడా పులివెందులే. నవీన్ కుటుంబ సభ్యులు రాజారెడ్డి హయాం నుంచి వైఎస్ కుటుంబంతో ఉన్నారు. నవీన్ కుటుంబ సభ్యులు వైఎస్ ఇంటి బట్టలు ఉతికేవారు. ఆ తర్వాత నవీన్ జగన్‌కు దగ్గరయ్యాడు. జగన్ వెంట ఉంటూ ఇంటి పనులు చక్కదిద్దుతుంటాడు. జగన్ తాడేపల్లికి మారడంతో నవీన్ కూడా అక్కడికి వెళ్లారు. 15ఏళ్లుగా జగన్‌తో ఉంటున్నాడు. ఇతడి ఫోన్ నుంచే వివేకా హత్య రోజు వైఎస్ భారతి, అవినాష్ రెడ్డితో మాట్లాడినట్టు అనుమానిస్తున్నారు. నవీన్ అసలు పేరు హరిప్రసాద్.