ఏపీ సీఎం జగన్ నిర్ణయానికి మద్దతు పలికిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ

వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయాలను, ఆయన పరిపాలనను గత కొన్నాళ్లుగా లక్ష్మీనారాయణ వ్యతిరేకిస్తూనే ఉన్నారు.

Advertisement
Update:2023-01-04 16:40 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను ముప్పతిప్పలు పెట్టిన సీబీఐ ఆఫీసర్ అనగానే వీవీ లక్ష్మీనారాయణే గుర్తుకు వస్తారు. ఆయను జేడీ (జాయింట్ డైరెక్టర్) లక్ష్మీనారాయణగానే తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులు. వైఎస్ జగన్ కేసును దర్యాప్తు చేసినప్పుడే చాలా ఫేమస్ అయ్యారు. ముందుగానే పదవీ విరమణ తీసుకొని రాజకీయాల్లోకి ప్రవేశించారు. మొదటి జనసేనలో జాయిన్ అయిన లక్ష్మీనారాయణ.. ఆ తర్వాత పవన్ కల్యాణ్‌తో విభేదించి.. బయటకు వచ్చారు. ప్రస్తుతం విశాఖపట్నం ఎంపీ సీటు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయాలను, ఆయన పరిపాలనను గత కొన్నాళ్లుగా లక్ష్మీనారాయణ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ప్రతీ విషయంలో విమర్శలు చేస్తూ మీడియా ముందుకు వచ్చే వారు. కానీ కొన్నాళ్లుగా ఆయన తన సొంత ఎన్జీవో పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే అనూహ్యంగా ఒక విషయంలో మాత్రం లక్ష్మీనారాయణ సీఎం జగన్‌ను వెనుకేసుకొని వచ్చారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా విమర్శిస్తున్న ఒక విషయంలో తన వైఖరి ఏమిటో స్పష్టం చేశారు.

ఇటీవల చంద్రబాబు నిర్వహించిన రోడ్‌షోలు, కార్యక్రమాల్లో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో కార్యకర్తలు మృతి చెందారు. దీంతో ఏపీ ప్రభుత్వం రోడ్ షోలపై కీలక నిర్ణయం తీసుకున్నది.

ఇకపై ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి రోడ్ షోలు నిర్వహించడానికి వీలు లేదని చెప్పింది. దీనిపై ప్రతిపక్షాలన్నీ విమర్శిస్తున్న సమయంలో లక్ష్మీనారాయణ భిన్నంగా స్పందించారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఎలాంటి తప్పు లేదని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. రోడ్లపై సభలు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వ నిర్ణయం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా పోలీసుల ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడటంలో అధికారులదే బాధ్యత అని ఆయన చెప్పుకొచ్చారు.

మరోవైపు జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా బాగానే ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే జగన్‌కు ప్రజలు ఎన్ని మార్కులు ఇస్తారో రాబోయే ఎన్నికల్లో తేలిపోతుందని చెప్పారు. రోడ్ షోల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేవలం ఒక పార్టీకి మాత్రమే చెల్లవని.. అధికార పార్టీకి కూడా ఈ నిర్ణయాలు వర్తిస్తాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మొత్తానికి ఒక్కసారిగా లక్ష్మీనారాయణ ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు అనుకూలంగా మాట్లాడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.  

Tags:    
Advertisement

Similar News