వైసీపీ ఓడినా.. కేంద్రంలో కీలకమే!
ప్రస్తుతం అటు ఇండియా, ఇటు ఎన్డీఏ కూటమిలో లేని పార్టీలు వైసీపీ, BJD. ఒడిశాలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీజేపీకి నవీన్ పట్నాయక్ మద్దతిచ్చే పరిస్థితి లేదు.
ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘనవిజయం సాధించింది. 175 స్థానాలకు గానూ కూటమి 164 స్థానాల్లో విజయం సాధించగా.. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఇక 25 ఎంపీ సీట్లలో కూటమి 21 స్థానాల్లో గెలుపొందగా.. వైసీపీ 4 సీట్లను నిలుపుకుంది.
దీంతో కేంద్రంలోని బీజేపీకి జగన్‌తో పెద్దగా అవసరం ఉండదని.. టీడీపీ బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి జగన్‌ను కేసుల పేరుతో ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తే అలా కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాలకే పరిమితమైంది. సొంతంగా మెజార్టీకి 32 సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల అవసరం ఏర్పడింది. ఇదే సమయంలో బయట నుంచి మద్దతు ఇచ్చే పార్టీలు కూడా బీజేపీకి అవసరం.
ప్రస్తుతం అటు ఇండియా, ఇటు ఎన్డీఏ కూటమిలో లేని పార్టీలు వైసీపీ, BJD. ఒడిశాలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీజేపీకి నవీన్ పట్నాయక్ మద్దతిచ్చే పరిస్థితి లేదు. దీంతో ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం మోడీకి ఏర్పడింది. ప్రధానంగా రాజ్యసభలో ఇతర పార్టీల సపోర్టు బీజేపీకి తప్పనిసరి.
వైసీపీకి రాజ్యసభలో ఎక్కువ స్థానాలు ఉండడం, తెలుగుదేశం పార్టీకి ఒక్క స్థానం కూడా లేకపోవడం జగన్‌కు సానుకూలాంశం. ప్రస్తుతం వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. దీంతో రాజ్యసభలో బీజేపీ జగన్ మద్దతు కోరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో జగన్ విషయంలో బీజేపీ సానుకూలంగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 2026 తర్వాతే వైసీపీకి రాజ్యసభలో బలం క్రమంగా తగ్గనుంది.