ఏపీలో ఛ‌లో విజ‌య‌వాడ‌పై టెన్ష‌న్ టెన్ష‌న్‌!

ఉద్యోగ సంఘాలు సెప్టెంబ‌ర్ 1న ఛ‌లో విజ‌య‌వాడ‌కు పిలుపునిచ్చాయి. అయితే ఈ కార్యక్రమానికి పర్మిషన్‌ లేదంటూ సీపీ కాంతి రాణా టాటా తేల్చిచెప్పారు. అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

Advertisement
Update:2022-08-28 13:41 IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సీపీఎస్ (కాంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీమ్‌) ర‌ద్దు చేస్తామ‌ని గ‌త ఎన్నిక‌ల ముందు హామీ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని స్థానంలో జీపీఎస్ (గ్యారెంటీడ్ పెన్ష‌న్ స్కీమ్‌) అమ‌లు చేసేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌టంపై భ‌గ్గుమంటున్న ఉద్యోగ సంఘాలు సెప్టెంబ‌ర్ 1న ఛ‌లో విజ‌య‌వాడ‌కు పిలుపునిచ్చాయి. అయితే ఈ కార్యక్రమానికి పర్మిషన్‌ లేదంటూ సీపీ కాంతి రాణా టాటా తేల్చిచెప్పారు. అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ క్రమంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

జీపీఎస్ ద్వారా సీపీఎస్ కంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నది ప్రభుత్వ వాదన. ఆర్థిక భారం వల్ల పాత విధానం అమలు కష్టమని రెండు రోజుల జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాలతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ మంత్రులు స్పష్టం చేశారు. జీపీఎస్ విధానంలో అవసరం అయితే మార్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే ఉద్యోగులు మాత్రం ససేమిరా అంటున్నారు. పాత పెన్షన్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 1న‌ ఛ‌లో విజయవాడకు పిలుపునిచ్చారు.

దీనిపై స్పందించిన మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ.. ఉద్యోగ సంఘాలకు సమస్యలపై పోరాటం చేసే హక్కు ఉంద‌ని, అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిస్తే ఊరుకుంటామా అంటూ కామెంట్ చేశారు మంత్రి బొత్స. సిపిఎస్ రద్దు చేస్తామని ఎన్నికల ముందే హామీ ఇచ్చామన్న మంత్రి.. సిపిఎస్ వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొత్త స్కీమ్ ప్రతిపాదన పెట్టామని వివరించారు. కొత్త స్కీమ్ సిపిఎస్ ను మించి ఉంటుంది, సమస్యను అందరూ సానుకూలంగా అర్థం చేసుకోవాలంటూ మంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే కొత్త‌గా అమలులోకి తెచ్చిన‌ ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ అన్ని శాఖల్లో అమలుచేస్తామని మరోసారి ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్న మంత్రి బొత్స రాష్ట్ర ప్రజల్లో వాళ్లు కూడా భాగస్వాములు అంటూ కామెంట్ చేశారు. మొత్తంగా సెప్టెంబర్ ఒకటో తేదీన ఛ‌లో విజ‌య‌వాడ‌ పిలుపు నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుందోన‌న్న టెన్ష‌న్ మాత్రం స‌ర్వ‌త్రా నెల‌కొంది.

Tags:    
Advertisement

Similar News