విశాఖ పెట్టుబడిదారుల సదస్సుకి ఎన్నికల కోడ్ అడ్డు..?

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి కూడా ఎన్నికలు జరుగుతుండటంతో విశాఖలో జరగాల్సిన ఈ సదస్సు వ్యవహారం డైలమాలో పడింది. ఈ నేపథ్యంలో సదస్సు నిర్వహణ విషయమై ఈసీ నుంచి స్పష్టత కోరుతూ విశాఖ జిల్లా యంత్రాంగం లేఖ రాసింది.

Advertisement
Update:2023-02-13 06:47 IST

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇటీవలే షెడ్యూల్ ఖరారైంది. రెండు చోట్లా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రభుత్వాలు ఆచితూచి అడుగులేస్తున్నాయి. ప్రారంభోత్సవాలపై కూడా వెనకడుగేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ కారణంగా తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవం కూడా వాయిదా పడింది. ఇప్పుడు ఏపీలో పెట్టుబడిదారుల సదస్సు కూడా డైలమాలో పడే అవకాశాలున్నాయి.

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో పెట్టుబడిదారుల సదస్సును మార్చి 3, 4వ తేదీల్లో నిర్వహించవచ్చా లేదా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని విశాఖ జిల్లా యంత్రాంగం ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి కూడా ఎన్నికలు జరుగుతుండటంతో విశాఖలో జరగాల్సిన ఈ సదస్సు వ్యవహారం డైలమాలో పడింది. పెట్టుబడిదారుల సదస్సుకు సీఎం జగన్‌ తో పాటు రాష్ట్ర మంత్రులు, కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగానికి సంబంధించి ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యతలను ప్రభుత్వ ప్రతినిధులు వెల్లడిస్తారు. ఈ నేపథ్యంలో సదస్సు నిర్వహణ విషయమై ఈసీ నుంచి స్పష్టత కోరుతూ విశాఖ జిల్లా యంత్రాంగం లేఖ రాసింది.

కోడ్ అడ్డంకి కాదా..?

అయితే ఈ సదస్సును ప్రభుత్వం చాన్నాళ్ల క్రితమే ప్రకటించింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా, అప్పటికే కొనసాగుతున్న పథకాలకు కోడ్‌ వర్తించబోదని అధికారులు చెబుతున్నారు. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతోనే ముందస్తుగా అనుమతి తీసుకోవాలని అనుకున్నారట. ప్రతిపక్షాల రాద్ధాంతం లేకుండా చేయడానికే ఈసీ గ్రీన్ సిగ్నల్ కోసం లేఖ రాశారట. ఈసీ నిర్ణయం తర్వాతే దీనిపై స్పష్టత వస్తుంది.

Tags:    
Advertisement

Similar News