విలీనంపై ముందుకే.. బొత్స క్లారిటీ..
రాష్ట్రంలో విద్యా సంస్కరణల యజ్ఞం చేపట్టామని, దాని ఫలితాలు వచ్చేందుకు సమయం పడుతుందని అన్నారు బొత్స. ఇంగ్లిష్ మీడియంలో బోధన, సీబీఎస్ఈ సిలబస్, డిజిటల్ క్లాస్ లు.. ఇలా సంస్కరణల శకం మొదలైందని చెప్పారు బొత్స.
ఏపీలో స్కూళ్ల విలీనంపై తీవ్ర చర్చ జరుగుతోంది. విలీనం వల్ల కొంతమంది పిల్లలకు పాఠశాలలు దూరమైపోతున్నాయని అక్కడక్కడా నిరసన ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు ఈ విలీన ప్రక్రియకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. కొన్నిచోట్ల వైసీపీ నాయకులు కూడా విద్యార్థులకు స్కూల్స్ దూరమైపోతున్నాయని, అధికారులు పునరాలోచించాలని సూచించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్కూళ్ల విలీనంపై వెనక్కి తగ్గేది లేదని మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి క్లారిటీ ఇచ్చారు. పాఠశాలల విలీనంపై విద్యార్థులు, తల్లిదండ్రులు అభ్యంతరాలు చెప్పడంలేదని, ఎవరో కుట్రపూరితంగా ఈ ప్రక్రియను అడ్డుకోవాలని చూస్తున్నారని చెప్పారు.
ఇది విధాన నిర్ణయం..
విద్యకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఉపాధ్యాయులకు లేదని అన్నారు మంత్రి బొత్స. ప్రీ ప్రైమరీ విద్య అవసరం లేదని కొంతమంది ఉపాధ్యాయులు చెబుతున్నారని, మరి వారి పిల్లలు ఏం చదువుతున్నారో, ఎక్కడ చదువుతున్నారో చెప్పాలని నిలదీశారు. ఉపాధ్యాయులంతా ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివిస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచేందుకే సంస్కరణలు చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలో విద్యా సంస్కరణల యజ్ఞం చేపట్టామని, దాని ఫలితాలు వచ్చేందుకు సమయం పడుతుందని అన్నారు బొత్స. ఇంగ్లిష్ మీడియంలో బోధన, సీబీఎస్ఈ సిలబస్, డిజిటల్ క్లాస్ లు.. ఇలా సంస్కరణల శకం మొదలైందని చెప్పారు బొత్స.
పుస్తకాల విషయంలో దోపిడీకి అడ్డుకట్ట..
పాఠ్య పుస్తకాల విషయంలో గతంలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు వారికి నచ్చిన పబ్లిషర్స్ దగ్గర పుస్తకాలు తీసుకొచ్చి, ఇష్టం వచ్చిన రేట్లు వసూలు చేసేవని, ఈ ఏడాది నుంచి ప్రభుత్వమే ప్రైవేట్ స్కూల్స్ కి నామమాత్రపు ధరకు పుస్తకాలు సరఫరా చేస్తోందని చెప్పారు మంత్రి బొత్స. ప్రైవేటు స్కూళ్ల పుస్తకాల దోపిడీకి అడ్డుకట్ట పడుతోందని అన్నారు.
అయితే ప్రభుత్వం ఇచ్చే పుస్తకాలకు తోడు.. ప్రైవేట్ స్కూల్స్ నోట్ బుక్స్, డైరీలు, వర్క్ బుక్స్ పేరుతో దోపిడీ కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం అనుకున్నంత సులభంగా మాత్రం ఈ దోపిడీ ఆగేట్టు కనిపించడంలేదు. ప్రభుత్వం ఇస్తున్న పుస్తకాలను వారు చెప్పిన రేట్లకే ఇస్తున్నా, అదనంగా ఇచ్చే పుస్తకాలు, మెటీరియల్ పేరుతో వాయించేస్తున్నాయి యాజమాన్యాలు.