సైబర్ నేరగాళ్ల బ్యాంక్ అకౌంట్లు సీజ్ - రాష్ట్రంలోనే ఇది తొలిసారి
ఈ సైబర్ నేరగాళ్లపై కడప వన్‌టౌన్, మైదుకూరు, దువ్వూరు, చాపాడులలో బాధితుల ఫిర్యాదు మేరకు 4 కేసులు నమోదయ్యాయి. ఆన్‌లైన్ మోసాల ద్వారా వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా ఈ సైబర్ నేరగాళ్లు రూ.11 కోట్ల మేరకు కొల్లగొట్టారని పోలీసుల విచారణలో తేలింది.
సైబర్ నేరగాళ్ల బ్యాంక్ అకౌంట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సీజ్ చేసింది. ఒక సైబర్ నేరానికి సంబంధించిన బ్యాంకు అకౌంట్లు సీజ్ చేయడం రాష్ట్రంలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం. వైఎస్సార్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఈ విషయాన్ని గురువారం వెల్లడించారు. ఆన్‌లైన్ మోసాలతో ప్రజలను నట్టేట ముంచుతున్న ఈ సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసిన పోలీసులు.. ఖాతాల్లోని రూ.27 కోట్ల నగదును సీజ్ చేసినట్టు ఎస్పీ చెప్పారు.
ఇంట్లోనే ఉంటూ సులువుగా డబ్బు సంపాదించొచ్చంటూ..
ఇంట్లోనే ఉంటూ సులువుగా డబ్బు సంపాదించొచ్చంటూ.. ఈ సైబర్ నేరగాళ్లు బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపిస్తుంటారు. ఆర్‌సీసీ, మేకింగ్ మనీ యాప్ పేరిట వీటిని పంపించి.. ఆ లింక్‌లపై క్లిక్ చేసిన అమాయక ప్రజలను కొంత పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో ఆదాయం పొందవచ్చని ఊరిస్తారు. బాధితుడు రిజిస్టర్ అయి.. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ట్రేడింగ్ ఆర్‌సీసీ, మనీ మేకింగ్, ఇతర బాధితుల ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నట్టుగా యాప్‌లో కనిపిస్తుంటుంది. స్క్రీన్‌పై ఫేక్ డిస్‌ప్లే అయ్యేలా వీటిని ఏర్పాటు చేసి అమాయక ప్రజలను నమ్మిస్తారు.
ఇతర ఖాతాలకు తరలించి.. క్రిప్టోగా మార్చి..
బాధితుల నుంచి డిపాజిట్ చేసిన మొత్తాన్ని నిందితులు వెంటనే ఇతర ఖాతాల్లోకి మళ్లిస్తారు. అనంతరం వాటిని క్రిప్టో కరెన్సీగా మార్చుకుంటారు. ఈ సైబర్ నేరగాళ్లపై కడప వన్‌టౌన్, మైదుకూరు, దువ్వూరు, చాపాడులలో బాధితుల ఫిర్యాదు మేరకు 4 కేసులు నమోదయ్యాయి. ఆన్‌లైన్ మోసాల ద్వారా వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా ఈ సైబర్ నేరగాళ్లు రూ.11 కోట్ల మేరకు కొల్లగొట్టారని పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల తమిళనాడుకు చెందిన ఇద్దరు సైబర్ నేరస్తులను అరెస్టు చేసిన పోలీసులు వారి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. తదుపరి చర్యల కోసం ఈడీకి సిఫారసు చేశారు.