స్వచ్ఛాంధ్ర నిధుల మళ్లింపు..! వైసీపీపై మరో నింద

ఆ నిధులేమయ్యాయంటూ పవన్ కల్యాణ్, అధికారులను సూటిగా ప్రశ్నించడంతో వారు అసలు విషయం బయటపెట్టారు. ఆ నిధులు పక్కదారి పట్టినట్టు అనుమానిస్తున్నారు.

Advertisement
Update: 2024-06-26 12:12 GMT

శ్వేత పత్రాల విడుదలకు ముందే గత వైసీపీ ప్రభుత్వంపై వరుస నిందలు పడుతున్నాయి. ముందుగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని జగన్ నాశనం చేశారంటూ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆ తర్వాత రుషికొండ భవనాల వ్యవహారం రచ్చ రచ్చగా మారింది. ఇక రాజధాని అమరావతి ప్రాంతంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనాలంటూ రోజుకో కథనం ప్రచురితమవుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్షలో మరో కొత్త విషయాన్ని బయటపెట్టారు అధికారులు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కు కేంద్రం రూ.1066 కోట్లు కేటాయించగా.. ఆ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం సదరు విభాగానికి విడుదల చేయలేదని చెప్పారు. ఆ నిధులేమయ్యాయంటూ పవన్ కల్యాణ్, అధికారులను సూటిగా ప్రశ్నించడంతో వారు అసలు విషయం బయటపెట్టారు. ఆర్థిక శాఖ స్వచ్ఛాంధ్రకు నిధులు విడుదల చేయలేదని అన్నారు. ఆ నిధులు పక్కదారి పట్టినట్టు అనుమానిస్తున్నారు.


స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌పై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. అధికారులు, ఇంజినీర్లు ఈ సమావేశానికి హాజరై, కార్పొరేషన్‌ పనితీరుపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. స్వచ్ఛాంధ్రకు కేంద్రం కేటాయించిన నిధులు, కార్పొరేషన్ ఖర్చుల వివరాలపై పవన్ ఆరా తీశారు. గత ఐదేళ్లలో కేంద్రం విడుదల చేసిన రూ.1,066 కోట్లు ఏమయ్యాయని అధికారులను ఆయన ప్రశ్నించారు. కేంద్ర నిధులను రాష్ట్ర ఆర్థికశాఖ స్వచ్ఛాంధ్రకు విడుదల చేయలేదని ఈ సందర్భంగా అధికారులు డిప్యూటీ సీఎంకు తెలియజేశారు.

డిప్యూటీ సీఎం పోస్ట్ తోపాటు, కీలక శాఖలను నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్ అధికారులతో వరుస సమీక్షలు చేపడుతున్నారు. ముఖ్యంగా కేంద్ర నిధులపై పవన్ ఆరా తీస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం నిధులు విడుదల చేసినా, వాటిని సరిగా ఖర్చు పెట్టడంలేదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంపై పవన్ ఆరోపణలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తన వాదనకు బలం చేకూర్చేలా ఆయన లెక్కలు బయటకు తీస్తున్నారు. ఈ క్రమంలో స్వచ్ఛాంధ్ర నిధుల్ని గత ప్రభుత్వం దారి మళ్లించిందనే విమర్శలు తెరపైకి వచ్చాయి. 

Tags:    
Advertisement

Similar News