నేనొక్కడినే తప్పు చేశానా.. మీరంతా మంచోళ్లా..?

తన భార్య, కుమార్తె నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్. తన భార్య మరికొందరు తనపై హత్యాయత్నం చేశారని తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఆయన పోలీసులను కోరారు.

Advertisement
Update:2024-08-10 15:45 IST

ఎట్టకేలకు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీడియా ముందుకొచ్చారు, రావాల్సిన అవసరం వచ్చింది. అయితే తానొక్కడినే తప్పు చేశానా అంటూ ఆయన మీడియాని ప్రశ్నించడం ఇక్కడ కొసమెరుపు. ఇక్కడున్నవారంతా తప్పులు చేసినా, వారి భార్యలు కాపాడుతూ వస్తున్నారని, వారందరికీ చేతులెత్తి మొక్కాలని అన్నారు దువ్వాడ. ప్రతి మగాడి జీవితాన్ని భార్యలు కాపాడటం వల్లే వారి జీవితాలు వర్థిల్లుతున్నాయని, కానీ తన జీవితంలో అది జరగలేదని చెప్పుకొచ్చారు. కోటానుకోట్ల కుటుంబాలు బాగున్నాయంటే స్త్రీ మూర్తుల పాదాలకు నమస్కారం చేయాలన్నారు దువ్వాడ శ్రీనివాస్.


గతంలో పవన్ కల్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యల్ని కూడా మీడియా దువ్వాడకు గుర్తు చేసింది. దీనికి కూడా ఆయన చాకచక్యంగా సమాధానం చెప్పారు. ఆయనకు ఏ పరిస్థితులు వచ్చాయో తనకు తెలియదని, ఇప్పుడు తన జీవితంలో అలాంటి సందర్భం వచ్చిందని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ రెండో వివాహం గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు దువ్వాడ. అయితే తానింకా రెండో పెళ్లి చేసుకోలేదని వైసీపీ ఎమ్మెల్సీ వివరణ ఇవ్వడం విశేషం.

అంతా బాగానే ఉంది కానీ.. సొంత సాక్షి మీడియా కూడా దువ్వాడ ప్రెస్ మీట్ జోలికి వెళ్లకపోవడం విశేషం. ఈ విషయంలో దువ్వాడను వైసీపీ కూడా పక్కనపెట్టినట్టే అనుకోవాలి. వైసీపీ ఓటమి తర్వాత దువ్వాడ కంటే ఎక్కువగా ఎవరూ సాక్షిలో లైవ్ డిబేట్స్ లో పాల్గొనలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తూ దువ్వాడ సాక్షి ఛానెల్ లో హైలైట్ అయ్యారు. కానీ రెండురోజులుగా ఆయన గురించి ఆ ఛానెల్ లో వార్త లేదు, కనీసం ఈరోజు దువ్వాడ ఆవేదన, వివరణ కూడా ఇవ్వకపోవడం విశేషం. 

పోలీసులకు ఫిర్యాదు..

తన భార్య, కుమార్తె నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్. తన భార్య మరికొందరు తన ఇంటి గేట్లు విరగ్గొట్టి, తనపై హత్యాయత్నం చేశారని తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఆయన పోలీసులను కోరారు. వారిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు ఎమ్మెల్సీ దువ్వాడ. 

Tags:    
Advertisement

Similar News