పవన్ కల్యాణ్ ఇచ్చిన చీర.. మాకంటే మాకు
జనసేన నేతలంటే ఏదో అభిమానంతో కావాలనుకున్నారనుకోవచ్చు. కానీ వైసీపీ, టీడీపీకి చెందిన కొంతమంది నేతల భార్యలు కూడా ఫోన్లు చేసి ఆ చీర గురించి ఎంక్వయిరీ చేసినట్టు తెలుస్తోంది.
ఇటీవల వారాహి వాహనానికి బెజవాడలో దుర్గ గుడి దగ్గర పూజ చేయించారు పవన్ కల్యాణ్. ఆ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని చీర, సారె సమర్పించారు. చీర సమర్పించినప్పుడు అదేమంత పెద్ద విషయం కాలేదు కానీ ఇప్పుడు ఆ చీర హాట్ టాపిక్ గా మారింది.
వాస్తవానికి అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరతో తొలుత దేవేరిని అలంకరిస్తారు. ఆ తర్వాత వాటిని కౌంటర్లలో ఉంచి అమ్మేస్తారు. అమ్మవారి చీరల కాంట్రాక్ట్ పొందిన వ్యక్తికి వాటిని అప్పగిస్తారు. అయితే పవన్ కల్యాణ్ ఇచ్చిన చీర కావాలంటూ ఇప్పటికే కాంట్రాక్టర్లపై చాలామంది ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.
జనసేన నేతలంటే ఏదో అభిమానంతో కావాలనుకున్నారనుకోవచ్చు. కానీ వైసీపీ, టీడీపీకి చెందిన కొంతమంది నేతల భార్యలు కూడా ఫోన్లు చేసి ఆ చీర గురించి ఎంక్వయిరీ చేసినట్టు తెలుస్తోంది. ఆ చీర విలువ 8వేల రూపాయలుగా నిర్థారించారు.
ఇప్పుడు ఆ చీరను ఎవరికి ఇవ్వాలనే విషయంలో కాంట్రాక్టర్ ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. రికమండేషన్లు తట్టుకోలేకపోతున్నాడట కాంట్రాక్టర్. ధర ఎంతయినా పర్వాలేదు, చీర మాత్రం తమకే కావాలంటున్నారట మహిళా భక్తులు.
మెగా ఫ్యామిలీకే ఇస్తాం..
అయితే పవన్ కల్యాణ్ అమ్మవారికి సమర్పించిన చీరను మెగా ఫ్యామిలీకే అప్పగించాలనే ఆలోచనకు వచ్చారట కాంట్రాక్టర్, ఆలయ సిబ్బంది. గతంలో కూడా ఇలాగే చేశామని, ఇప్పుడు కూడా ఆ చీరను చిరంజీవి కుటుంబ సభ్యులకే అప్పగిస్తామని అంటున్నారు.
గతంలో చిరంజీవి సతీమణి సురేఖ ఓ చీరను అమ్మవారికి కానుకగా ఇచ్చారు. దాన్ని కొనుగోలు చేయడానికి పోటీ ఎక్కువగా ఉండడంతో కొద్దినెలల తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ కు ఆ చీరను కానుకగా ఇచ్చారు ఆలయ సిబ్బంది.
ఇప్పుడు అదేవిధంగా పవన్ కల్యాణ్ సమర్పించిన చీరను.. మెగా ఫ్యామిలీనుంచి వచ్చినవారికి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. బయటనుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక చివరకు ఆ పని చేస్తామంటున్నారు కాంట్రాక్టర్, ఆలయ సిబ్బంది.