తిరుమలలో డ్రోన్ కలకలం.. వీడియోలో ఏమేం ఉన్నాయంటే..?
టీటీడీ భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. డ్రోన్ తో వీడియోలు తీసినవారిని అదుపులోకి తీసుకున్నారు.
తిరుమలలో మళ్లీ డ్రోన్ కలకలం రేగింది. గతంలో ఓసారి ఇలా డ్రోన్ ఎగరేసిన వార్తలు రావడంతో టీటీడీ అప్రమత్తమైంది. తిరుమలలో ఓ సర్వే టీమ్ వీడియోలు తీసేందుకు ప్రయత్నించినట్టు అప్పట్లో వివరణ బయటకు రావడంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. తాజాగా మరోసారి తిరుమలలో డ్రోన్ వ్యవహారం వైరల్ గా మారింది. ఈసారి తిరుమల ఘాట్ రోడ్ లో ఓ కుటుంబం డ్రోన్ ఎగురవేసి వీడియోలు తీసే ప్రయత్నం చేసింది. వారు డ్రోన్ ఎగురవేయడాన్ని మరికొందరు సెల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వ్యవహారం బయటపడింది.
ఘాట్ రోడ్డు 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ సాయంతో ఇద్దరు వ్యక్తులు తిరుమల కొండలను వీడియో తీసేందుకు ప్రయత్నించారు. వీరు అసోంకు చెందిన భక్తులు. స్వామివారి దర్శనం అనంతరం కారులో కొండ కిందకు వెళ్తూ.. మోకాళ్ల పర్వతం వద్ద కాసేపు ఆగారు. తమతో తెచ్చుకున్న డ్రోన్ కెమెరాని బయటకు తీశారు. దాన్ని ఎగురవేసి వీడియోలు తీశారు. కొంతమంది వారించినా ఫలితం లేదు. దీంతో వారిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో టీటీడీ భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. డ్రోన్ తో వీడియోలు తీసినవారిని అదుపులోకి తీసుకున్నారు.
ఘాట్ రోడ్ అందాలు, అక్కడి చెట్లను డ్రోన్ తో వీడియోలు తీసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి అసలు డ్రోన్ కెమెరాలను తిరుమల కొండపైకి తీసుకెళ్లేందుకే అనుమతి లేదు. కానీ భద్రతా వైఫల్యం వల్లే అలిపిరి నుంచి వెళ్లిన కారులో డ్రోన్ కెమెరాలను అసోం భక్తులు కొండపైకి తీసుకెళ్లారు. అక్కడే ఆ డ్రోన్ స్వాధీనం చేసుకుని ఉంటే ఇంత గొడవ జరిగేది కాదు. ఇకపై అయినా అలిపిరి వద్ద నిఘా మరింత కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు భక్తులు.