భక్తుల మనోభావాలపై దాడి జరిగితే ప్రశ్నించవద్దా?: పవన్
తిరుమల లడ్డూ కల్తీపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. తిరుమల లడ్డూ కల్తీపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో దీక్ష చేపట్టారు. అంతకుముందు ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. 11 రోజుల పాటు ఆయన దీక్ష కొనసాగించనున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూను మహాప్రసాదంగా భావిస్తామని పవన్ పేర్కొన్నారు. ప్రసాదాన్ని కూడా కల్తీ చేస్తారా అని ఆవేదన కలుగుతున్నది. ఈ స్థాయిలో కల్తీ జరుగుతున్నదని ఊహించలేదన్నారు. అపవిత్రం చేస్తే ఏం మాట్లాడకుండా ఉండాలా అని ప్రశ్నించారు. తప్పులు చేసిన వారిని జగన్ ఎలా సమర్థిస్తారని పవన్ నిలదీశారు.
తిరుమలలో జరిగిన అపచారం అందరికీ తెలిసిందేనని అన్నారు. 300 ఏళ్లకు పైగా తిరుమల లడ్డూ ప్రసాదాన్ని పంచుతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నదన్నారు. 2019 నుంచి సంస్కరణల పేరుతో వైసీపీ చాలా మార్పులు చేసిందని మండిపడ్డారు.