విశాఖకు రాజధాని హోదా వచ్చేసినట్లేనా?

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ప్రతి అంశాన్ని విశాఖ కేంద్రంగానే నిర్వహిస్తోంది. అలాగే కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమాలను కూడా వైజాగ్‌లోనే జరుపుతోంది. క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే విశాఖకు ఇప్ప‌టికే రాజధాని హోదా వచ్చేసిందనే అనుకోవాలి.

Advertisement
Update:2023-01-14 10:34 IST

సుప్రిం కోర్టులో తీర్పు ఎలా వస్తుందో తెలీదుకానీ ప్రభుత్వపరంగా, రాజకీయంగా మాత్రం విశాఖపట్నానికి ఇప్పటికే రాజధాని హోదా వచ్చేసినట్లే అనుకోవాలి. హోదా అంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన రూపంలోనే కాకుండా ఆచరణలో కూడా వచ్చేసినట్లే అనుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ప్రతి అంశాన్ని విశాఖ కేంద్రంగానే నిర్వహిస్తోంది. అలాగే కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమాలను కూడా వైజాగ్‌లోనే జరుపుతోంది. క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే విశాఖకు ఇప్ప‌టికే రాజధాని హోదా వచ్చేసిందనే అనుకోవాలి.

కేంద్రం తాజాగా వేసిన వందే భారత్ రైలు కూడా సికింద్రాబాద్ నుండి వైజాగ్‌కే వచ్చింది. వందే భారత్ రైలును నరేంద్ర మోడీ చాలా ప్రిస్టేజియస్‌గా తీసుకున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మొదటి విశాఖకే రావటం గమనార్హం. ఈ మధ్య మోడీ రెండు రోజుల పర్యటన కూడా విశాఖ కేంద్రంగానే జరిగింది. వైజాగ్‌లో కూర్చునే వేల కోట్లరూపాయల అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు చేశారు. ఫిబ్రవరి 16, 17 తేదీల్లో గ్లోబల్ టెక్ సమ్మిట్ కూడా ఇక్కడే జరగబోతోంది. అలాగే మార్చి 4, 5 తేదీల్లో విశాఖలోనే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సును నిర్వహించబోతున్నారు.

పెద్ద పెద్ద ఐటి కంపెనీలు కూడా వైజాగ్‌లోనే ఏర్పాటవుతున్నాయి. తొందరలోనే జీ 20 దేశాల సన్నాహక సదస్సులు కూడా విశాఖలోనే జరుగుతున్నాయి. జీ 20 దేశాల సన్నాహక సదస్సుకు వైజాగ్ వేదిక కాబోతున్నది. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న సదస్సుల్లో రెండింటిని విశాఖలోనే నిర్వహించేందుకు జగన్ ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ ఆలోచన ఎలాగుందంటే సుప్రిం కోర్టు విచారణలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే హ్యాపీగా మూడు రాజధానుల ఏర్పాటవుతాయి.

ఒకవేళ ఏదన్నా తేడావస్తే మాత్రం తన క్యాంప్ ఆఫీసును వైజాగ్‌కు తరలించేయాలని డిసైడ్ చేశారా అన్నట్లుగా ఉంది. ఎందుకంటే జగన్ ఆలోచనలకు తగ్గట్లుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రులు కూడా తమ క్యాంప్ ఆఫీసును ఏర్పాటు చేసుకోవటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. కాబట్టి జరుగుతున్నది చూస్తుంటే ఇప్పటికే రాజకీయంగా విశాఖకు రాజధాని హోదా వచ్చేసినట్లే అని అర్ధమవుతున్నది.

Tags:    
Advertisement

Similar News