అతన్ని విలన్ అంటారా.. హీరో అంటారా.. చంద్రబాబుపై అంబటి తీవ్ర వ్యాఖ్యలు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు నేరుగా కాకుండా పరోక్షంగా చేశారు. బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ అనే షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో రెండోవ సీజన్ ఈనెల 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ షోలో మొదటి గెస్టుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ హాజరయ్యారు. ఇందుకు సంబంధించి ఒక ప్రోమో వీడియో కూడా నిర్వాహకులు విడుదల చేశారు. ఆ ప్రోమోలో 1995లో టీడీపీలో నెలకొన్న సంక్షోభం గురించి చంద్రబాబు ప్రస్తావించారు.
అందులో చంద్రబాబు బాలకృష్ణతో మాట్లాడుతూ..' 1995లో నేను తీసుకున్న ఆ నిర్ణయం తప్పా? ' అని అడుగుతారు. ' కాళ్లు పట్టుకొని వేడుకున్నా.. అయినా వినలేదు' అని చంద్రబాబు ఆ వీడియోలో చెప్పారు. 1995లో టీడీపీలో నెలకొన్న సంక్షోభంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చి చంద్రబాబు సీఎం అయిన సంగతి తెలిసిందే. అయితే అప్పటినుంచి చంద్రబాబుకు మామను వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యాడు..అనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.
అయితే దీనిపై చంద్రబాబు ఎప్పుడూ నోరెత్తలేదు. అయితే మొదటిసారి చంద్రబాబు అన్ స్టాపబుల్ షోలో 1995లో టీడీపీలో నెలకొన్న సంక్షోభంపై నోరు విప్పినట్లు తెలుస్తోంది. ఆనాడు కాళ్లు పట్టుకున్నా ఎన్టీఆర్ తన మాట వినకపోవడంతో పార్టీని స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందని ప్రోమో ద్వారా చంద్రబాబు పరోక్షంగా వివరించారు.
దీనిపై మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ' కాళ్లు పట్టుకొని అడుక్కున్నాడు తనమాట వినమని! వినల! గొంతు పిసికి చంపేశాడు!! అతన్ని విలన్ అంటారా? హీరో అంటారా' అని అంబటి ట్వీట్ చేశారు. కాగా ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ట్వీట్ పై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. మంత్రి అంబటిపై ధూషణలకు దిగాయి.