వైసీపీలోనే ఉన్నానంటే నాకే అసహ్యంగా ఉంది..
తానింకా వైసీపీలోనే ఉన్నానంటున్నారు డీఎల్. పార్టీ కూడా తనను బహిష్కరించలేదని చెప్పారు. వైసీపీలో ఉన్నందుకు తనకు అసహ్యంగా ఉందని అన్నారు.
పార్టీలో ఉంటూ పార్టీ అధినాయకత్వాన్ని ధిక్కరిస్తూ, చెడామడా తిట్టేసే ఎంపీ రఘురామ కృష్ణంరాజుతోపాటు.. పదవులు లేని చాలామంది అసంతృప్త నేతలు వైసీపీలో ఉన్నారు. అలాంటివారిలో ఒకరు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి. సరిగ్గా జగన్ పుట్టినరోజున ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ ఇంత అవినీతి పరుడు అని తాను అనుకోలేదన్నారు. పరిపాలన మొదలు పెట్టినరోజునుంచే సీఎం జగన్ అవినీతికి పాల్పడ్డారని చెప్పారు డీఎల్.
నాకే అసహ్యంగా ఉంది..
డీఎల్ రవీంద్రారెడ్డిని వైసీపీ అధికారికంగా బహిష్కరించలేదు కానీ ఆయనకు పార్టీతో ప్రస్తుతం ఎలాంటి సంబంధం లేదు. అయితే తానింకా వైసీపీలోనే ఉన్నానంటున్నారు డీఎల్. పార్టీ కూడా తనను బహిష్కరించలేదని చెప్పారు. వైసీపీలో ఉన్నందుకు తనకు అసహ్యంగా ఉందని అన్నారు. అసలింతకీ ఆయన వైసీపీలో ఉన్నారా, ఆయన ఉన్నట్టు ఆ పార్టీ నేతలు గుర్తించారా అనేది తేలాల్సి ఉంది.
వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పే..
ఈ దఫా ఎన్నికల్లో వైనాట్ 175 అంటున్నారు సీఎం జగన్. కానీ డీఎల్ మాత్రం వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్ప అంటున్నారు. వైఎస్ వివేకా హత్య కేసు గురించి కూడా డీఎల్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 3 నుంచి మాజీ మంత్రి వివేకా హత్య కేసు మలుపు తిరుగుతుందని, ఆ కేసులో ఎర్ర గంగిరెడ్డే కీలక వ్యక్తి అని సీబీఐ గుర్తించిందని, చాలామంది మెడకు ఉచ్చు బిగిసే అవకాశముందని చెప్పారు డీఎల్. వివేకా హత్య కేసులో ఒంటరిగా పోరాడుతున్న ఆమె కుమార్తె సునీత ధైర్యాన్ని మెచ్చుకోవచ్చని అన్నారు.