పవన్‌కళ్యాణ్‌కు అనకాపల్లిలో అసంతృప్తుల స్వాగతం!
అనకాపల్లి, ఎలమంచిలి రెండు చోట్లా కాపుల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. కాబట్టి తమకు గెలుపు విజయ అవకాశాలున్నాయని జనసేన భావిస్తోంది. అయితే టీడీపీ నేతల అసమ్మతి, అసంతృప్తి దెబ్బకొడతాయని అభ్యర్థులు భయపడుతున్నారు.
తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో గల్లీ గల్లీ తిరిగిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదివారం అనకాపల్లి జిల్లాలో ప్రచారానికి బయల్దేరనున్నారు. ప్రధానంగా కూటమిలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న అనకాపల్లి, ఎలమంచిలి నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం కీలకం కానుంది. అయితే జనసేన శ్రేణులకు తమ అధినేత ప్రచారానికి వస్తున్నారన్న ఆనందం కంటే.. టీడీపీ నుంచి తగినంత సహకారం లేకపోవడం వల్ల ఏర్పడుతున్న ఆందోళనే ఎక్కువగా ఉంది. తమకు టికెట్ దక్కలేదని ఇక్కడ టీడీపీ నేతలు అంటీముట్టనట్టుగా ఉంటున్నారని, పవన్ పర్యటన సందర్భంగా అయినా వారంతా మనస్ఫూర్తిగా కలిసివస్తారని జనసేన అభ్యర్థులు కొండంత ఆశ పెట్టుకున్నారు.
అనకాపల్లిలో అలా..
అనకాపల్లిలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మొదట ఆయన్ను అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. బీజేపీ కూడా కూటమిలో చేరి ఎక్కువ ఎంపీ సీట్లు అడగటంతో జనసేన అనకాపల్లి సీటును వదులుకోవాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయంగా అనకాపల్లి అసెంబ్లీ స్థానంలో కొణతాలకు టికెటిచ్చారు. దీంతో ఇక్కడ చాలాకాలంగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, వైసీపీతో విభేదించి టీడీపీ పంచన చేరిన దాడి వీరభద్రరావు అసంతృప్తిగా ఉన్నారు. కొణతాలకు సహకరించాలని చంద్రబాబు చెప్పడంతో పీలా ఆయనకు మద్దతు ప్రకటించారు. మరోవైపు కొణతాలే దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లి మద్దతు కోరారు. అయితే పీలాగానీ, దాడి గానీ పూర్తి స్థాయిలో తమ వర్గాన్ని ప్రచారంలోకి దింపలేదని చెబుతున్నారు.
ఎలమంచిలిలో ఇలా..
ఎలమంచి సీటు అనూహ్యంగా జనసేనకు దక్కింది. ఇక్కడ పార్టీ అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌కు పవన్ టికెటిచ్చారు. అయితే టీడీపీ బలంగా ఉన్నచోట జనసేనకు సీటివ్వడమేంటని టీడీపీ నేతలు, క్యాడర్ మండిపడుతున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు, సీనియర్ నేత పప్పల చలపతిరావులతో చంద్రబాబు మాట్లాడి జనసేన అభ్యర్థికి మద్దతివ్వాలని సూచించారు. అయితే ప్రగడ మద్దతిచ్చి ప్రచారంలో పాల్గొంటున్నా పప్పల వర్గీయుల సందడి ఎక్కడా కనపడటం లేదు.
రెండు చోట్లా గెలవాలని ఆశ
అనకాపల్లి, ఎలమంచిలి రెండు చోట్లా కాపుల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. కాబట్టి తమకు గెలుపు విజయ అవకాశాలున్నాయని జనసేన భావిస్తోంది. అయితే టీడీపీ నేతల అసమ్మతి, అసంతృప్తి దెబ్బకొడతాయని అభ్యర్థులు భయపడుతున్నారు. పవన్ పర్యటనలో టీడీపీ నేతలను కలుపుకొని వెళితే బాగుంటుందని ఆశపడుతున్నారు.