కమలంతో ప్రయాణంపై తమ్ముళ్లలో కలవరం
ఏపీలో బీజేపీతో పొత్తు అంటే తెలుగుదేశానికి చాలా నష్టం. మైనారిటీలు ఇప్పుడే టిడిపికి దగ్గరవుతున్నారు. బీజేపీ నుంచి ఓటు బ్యాంకు ఏమీ లేదు. బీజేపీతో కలిస్తే మైనారిటీల ఓట్లకి భారీ గండి పడటం ఖాయం.
తెలుగుదేశంలో కమలం కలకలం రేపుతోంది. కమలనాథుల పిలుపు పసుపు శిబిరంలో ఓ వైపు మోదం-మరో వైపు ఖేదం నెలకొంది. 2018లో బీజేపీతో బంధం తెంపుకున్న తెలుగుదేశం పార్టీ బద్ధశత్రువులా కేంద్రంలోని సర్కారుతో పోరాడింది. బీజేపీ కూడా టిడిపి ఎత్తులని చిత్తు చేస్తూ అష్టదిగ్బంధనం చేసింది. టిడిపి 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత బీజేపీకి వైసీపీ మైత్రి ఏర్పడింది. ఈ ఐదేళ్ల కాలంలో టిడిపి కేంద్రంలోని బీజేపీకి దగ్గరవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా సఫలం కాలేదు.
ఎట్టకేలకు ఢిల్లీలో కమలనాథుల నుంచి చంద్రబాబుకి పిలుపు వచ్చింది. ఏపీలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్న నేపథ్యంలో బీజేపీ కూడా తమ పొత్తుల ఎత్తులను మొదలు పెట్టింది. బీజేపీలో అమిత్ షాతో భేటీ అంటే చాలా ప్రాముఖ్యం ఉన్నదే. బాబు కానీ, బీజేపీ కానీ ఈ భేటీపై నోరు మెదపలేదు. అంటే పూర్తిస్థాయి ప్రతిపాదనలు ఏవీ కార్యరూపం దాల్చకపోయి ఉండొచ్చు. పొత్తు బేరం తెగకపోయి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకుల మాట.
ఏపీలో బీజేపీతో పొత్తు అంటే తెలుగుదేశానికి చాలా నష్టం. మైనారిటీలు ఇప్పుడే టిడిపికి దగ్గరవుతున్నారు. బీజేపీ నుంచి ఓటు బ్యాంకు ఏమీ లేదు. బీజేపీతో కలిస్తే మైనారిటీల ఓట్లకి భారీ గండి పడటం ఖాయం. బీజేపీలో చేరిన కొందరు నేతలు ఏపీలో మాకు గతంలో ఉన్న ఒక శాతం ఓటింగ్ ఇప్పుడుందో లేదో తెలియదంటూ వ్యాఖ్యానించడం ఆ పార్టీ దుస్థితికి నిదర్శనం. బీజేపీ బలం అంతా ఒక్కటే, కేంద్రంలో అధికారంలో ఉండటం.
ఏపీలో జనసేనతో కలిసి వెళ్లాలనుకుంటున్న టిడిపికి బీజేపీ రూపంలో ముందరి కాళ్లకు బంధాలు పడుతున్నాయి. జనసేన బీజేపీతో కలిసి ఎన్నికలకి వెళ్దామనే ప్రతిపాదనలే ఇప్పుడు టిడిపి నేతలకి కలవరం పుట్టిస్తున్నాయి. రాజకీయ వాతావరణం అంతా టిడిపికి అనుకూలంగా మారుతుండగా, బీజేపీతో పొత్తు తమ సీట్లు-ఓట్లకి తూట్లు పెట్టడం ఖాయమనే ఆందోళన నెలకొంది. జనసేన, బీజేపీతో కలిసి ఎన్నికలకి టిడిపి వెళ్తే చాలా సీట్లు ఆ రెండు పార్టీలకు కేటాయించాల్సి వస్తుంది. ఇదే జరిగితే చాలామంది టిడిపి సీనియర్ నేతల సీట్లు గల్లంతు కావడం ఖాయం. కమలంతో ఎన్నికల ప్రయాణం తెలుగు తమ్ముళ్లలో తీవ్ర కలవరం రేపుతోంది.