నారా లోకేశ్‌తో ఢిల్లీలో డిన్నర్ పార్టీ.. హోస్ట్ రఘురామ కృష్ణం రాజు?
ఢిల్లీ పరిధిలోని కమ్మ సంఘం వారి కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది.
తన తండ్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ నేతల మద్దతు కూడగట్టడానికి కొన్ని రోజులుగా నారా లోకేశ్ ఢిల్లీలోనే ఉంటున్నారు. ఒకవైపు సీనియర్ న్యాయవాదులను కలుస్తూనే.. కేంద్రంలోని పెద్దలను కూడా కలవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వంలోని ఒక్క నాయకుడు కూడా నారా లోకేశ్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. యువగళం పాదయాత్ర ప్రారంభిస్తానని తొలుత లీకులు ఇచ్చిన నారా లోకేశ్.. ఆ తర్వాత పాదయాత్రను రద్దు చేసుకొని ఢిల్లీలోనే ఉండటానికి నిర్ణయించుకున్నారు.
తాజాగా ఢిల్లీ పరిధిలోని కమ్మ సంఘం వారి కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. టీడీపీకి మొదటి నుంచి బలమైన ఆర్థిక తోడ్పాటు అందిస్తున్న కమ్మ సామాజిక వర్గమే. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో వారి మద్దతు మరింత అవసరం అయ్యింది. అందుకే ఢిల్లీ పరిధిలో కమ్మ సామాజిక వర్గం వారి కోసమే ప్రత్యేకంగా ఒక డిన్నర్ పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. దీనికి సంబంధించిన ఒక వాట్సప్ చాట్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది.
న్యూఢిల్లీలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఇంటిలో శనివారం 'లోకేశ్ మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమాన్ని కమ్మ సంఘం ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని నార్త్ అవెన్యూలో ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం 7 గంటలకు టీతో ప్రారంభమై.. రాత్రి నాన్-వెజ్ డిన్నర్‌తో ముగుస్తుందని సదరు ఆహ్వానంలో పేర్కొన్నారు. నారా లోకేశ్, రఘురామ కృష్ణం రాజుతో పాటు చంద్రబాబు కేసును వాదిస్తున్న సిద్దార్థ లూథ్రా కూడా ఈ డిన్నర్ పార్టీలో పాల్గొంటారని పేర్కొన్నారు.
రఘురామ కృష్ణం రాజు ఎప్పటి నుంచో టీడీపీతో అంటి పెట్టుకొని తిరుగుతున్నారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో లోకేశ్ సమావేశాలు ఏర్పాటు చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నా.. అవి ఫలించడం లేదు. టీడీపీ శ్రేణుల్లో కూడా రోజు రోజుకూ ఆశలు సన్నగిల్లుతుండటంతో.. తాజాగా రఘురామ ఈ మీట్ అండ్ గ్రీట్‌ను ఏర్పాటు చేసినట్లు చర్చ జరుగుతున్నది. కనీసం కమ్మ సామాజిక వర్గంలోని ముఖ్యులతో మీటింగ్ ఏర్పాటు చేసి నారా లోకేశ్‌లో కాస్త ధైర్యం నింపాలనే ఈ వీకెండ్ పార్టీ ఏర్పాటు చేశారని పలువురు అంటున్నారు.