బ్లాక్ బోర్డ్ స్థానంలో స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లు..
పాఠ్యాంశాలు మరింత నిశితంగా అర్థం అయ్యేలా బోధించేందుకు ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్ డిస్ ప్లే లేదా ప్రొజెక్టర్లు పెట్టాలని అధికారులను ఆదేశించారు.
ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో ఇకపై బ్లాక్ బోర్డ్ వినియోగం పూర్తిగా తగ్గిపోయేలా ఉంది. ప్రీ ప్రైమరీ సెక్షన్ నుంచి పై తరగతుల వరకు అందరికీ డిజిటల్ బోధన మొదలు కాబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. పీపీ–1 నుంచి రెండో తరగతి వరకు స్మార్ట్ టీవీలు, 3వ తరగతి.. ఆపైన తరగతులకు ప్రొజెక్టర్ లు పెట్టేలా ప్రణాళికలు రూపొందించారు అధికారులు. తొలి దశలో నాడు - నేడు పూర్తి చేసుకున్న అన్ని హైస్కూళ్లలో మొదటి దశ కింద ఈ డిజిటల్ పరికరాలు ఏర్పాటు కాబోతున్నాయి.
విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. ఆధునిక బోధన విధానాలను అనుసరిస్తూ విద్యార్థులకు అత్యుత్తమ రీతిలో అత్యున్నత పరిజ్ఞానాన్ని అందించేందుకు కృషి చేయాలని సూచించారు. దానికోసం ప్రతి తరగతి గదిలో డిజిటల్ విద్యా బోధనకు శ్రీకారం చుట్టాలన్నారు. పాఠ్యాంశాలు మరింత నిశితంగా అర్థం అయ్యేలా బోధించేందుకు ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్ డిస్ ప్లే లేదా ప్రొజెక్టర్లు పెట్టాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి ఇంటరాక్టివ్ డిస్ ప్లేలు, ప్రొజెక్టర్ల నమూనాలను ఆయన పరిశీలించారు. వాటి నాణ్యత వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో వీటిని ఫైనల్ చేసి స్కూళ్లకు పంపించాలన్నారు. నాణ్యమైన డిజిటల్ పరికరాలను మాత్రమే ఏర్పాటు చేయాలని చెప్పారు. స్మార్ట్ బోధన సదుపాయాల వల్ల విద్యార్థులతోపాటు, ఉపాధ్యాయులకు కూడా మేలు జరుగుతుందన్నారు జగన్. స్కూళ్లలో విలువైన ఉపకరణాలను ఏర్పాటు చేస్తున్నందు వల్ల భద్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇకపై అన్ని స్కూళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ఆలోచించాలన్నారు.
బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో ట్యాబ్ లు
ఈ విద్యా సంవత్సరం నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ట్యాబ్ లు అందించబోతోంది. నాణ్యమైన ట్యాబ్ లను ఎంపిక చేయాలని అధికారులకు సూచించిన జగన్, అందులో బైజూస్ సంస్థ కంటెంట్ ను అప్‌లోడ్ చేస్తుందని చెప్పారు. విద్యా కానుకకు సంబంధించి వచ్చే ఏడాదికి పంపిణీ కోసం తీసుకోవలసిన చర్యలపై ఇప్పటి నుంచే ప్రణాళికా బద్ధంగా సన్నద్ధం కావాలని అధికారులకు సూచించారు. రెండో దశ నాడు - నేడు పనులను వేగవంతం చేయాలని చెప్పారు. టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ సమర్థంగా వినియోగించుకోవాలని చెప్పారు.