మార్గదర్శికి సొంత చట్టముందా..?

తమ లెక్కలను ఇత‌రుల‌కు చెప్పాల్సిన అవసరం లేదని, రికార్డును చూపించాల్సిన అవసరం కూడా తమకు లేదని శైలజ తెగేసి చెప్పారట. లేని చెక్కులను బ్యాలెన్స్ షీటులో ఎలా చూపారన్న ప్రశ్నకు అదంతా తనకు తెలీదని చెప్పారట.

Advertisement
Update:2023-04-07 11:59 IST

మార్గదర్శి చిట్ ఫండ్స్ నిర్వహణకు తాము సొంత చట్టాన్ని రూపొందించుకున్నట్లు సంస్థ‌ ఎండీ చెరుకూరి శైలజ చెప్పారా..? జగన్మోహన్ రెడ్డి మీడియా మాత్రం ఇదే చెప్పింది. మార్గదర్శి చిట్ ఫండ్ మోసాలపై ఛైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజల‌ను ఏ-1, ఏ-2లుగా చేర్చుతూ సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే రామోజీని విచారించిన అధికారులు గురువారం శైలజను కూడా విచారించారు. విచారణ సందర్భంగా ఎండీ విచిత్రమైన సమాధానాలు చెప్పారని జగన్ మీడియా చెప్పింది.

చిట్ ఫండ్ నిధులను ఇతర అవసరాలకు మళ్ళించినట్లు శైలజ అంగీకరించారట. సంస్థ‌లో మదుపరుల పెట్టుబడులను తమ సొంత పెట్టుబడులుగా ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టినట్లు అంగీకరించారని సమాచారం. చిట్ ఫండ్ నిధులను చిట్టేతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదని తెలియదా అన్న ప్రశ్నకు తమ చట్ట ప్రకారం తప్పుకాదని వాదించారట. ప్రభుత్వం రూపొందించిన చిట్ ఫండ్ చట్టం గురించి తనకు తెలియదని, చిట్ ఫండ్ చట్టం తమకు వర్తించదని స్పష్టంగా చెప్పారట.

ఆర్బీఐ గైడ్ లైన్స్, చిట్ ఫండ్ చట్టం-1982 ప్రకారమే సంస్థ‌ను నడుపుతున్నారా..? అన్న ప్రశ్నకు తమకు ఇతర చట్టాలతో పనిలేదని తమ సంస్థ‌ను సొంత చట్టం ప్రకారమే నడుపుకుంటున్నట్లు చెప్పారట. అధికారులు చెప్పిన ఏ చట్టాలు తమకు వర్తించవని కూడా అన్నారట. తాము తయారుచేసుకున్న చట్టాల ప్రకారమే తమ కంపెనీలను నిర్వహిస్తామని శైలజ చెప్పిన సమాధానంతో అధికారులకు షాక్ కొట్టినట్లయ్యిందట.

తమ లెక్కలను ఇత‌రుల‌కు చెప్పాల్సిన అవసరం లేదని, రికార్డును చూపించాల్సిన అవసరం కూడా తమకు లేదని శైలజ తెగేసి చెప్పారట. లేని చెక్కులను బ్యాలెన్స్ షీటులో ఎలా చూపారన్న ప్రశ్నకు అదంతా తనకు తెలీదని చెప్పారట. అధికారులు ఏ ప్రశ్నవేసినా అంతా తామిష్ట ప్రకారమే చేసుకుంటామని సమాధానమిచ్చారట. కొన్ని ప్రశ్నలకు తెలీదని, గుర్తులేదని చెప్పి మౌనంగా ఉండిపోయారట. కొన్ని డాక్యుమెంట్లను చూపించి చూడమని అధికారులంటే తనకు చూపు సరిగా లేదని కాబట్టి చూడలేనని విచిత్రమైన సమాధానమిచ్చారట. జరిగింది చూస్తుంటే మార్గదర్శి యాజమాన్యం అన్నింటికీ తెగించినట్లే అర్థ‌మవుతోంది. మరి సీఐడీ ఏమిచేస్తుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News