మోడీని జగన్ హెచ్చరించారా..?
ఇక ప్రస్తుత విషయానికి వస్తే 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటినుండి నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూడా ఏపీకి అన్యాయమే చేస్తోంది.
విశాఖపట్నంలో నరేంద్రమోడీ పాల్గొన్న శంకుస్థాపన కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇంతకీ జగన్ ఏమన్నారంటే.. విభజన రూపంలో ఏపీకి 8 ఏళ్ళ క్రితం తగిలిన గాయాలు ఇంకా మానలేదన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం చేయాల్సిన సాయం, అందించాల్సిన సహకారం చాలావుందన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని జనాలు ఇప్పటికీ మరచిపోలేదన్నారు. అలాగే కేంద్రం చేసే సాయాన్ని కూడా జనాలు గుర్తుంచుకుంటారని చెప్పారు.
కాంగ్రెస్ చేసిన రాష్ట్ర విభజనను జనాలు మరచిపోలేదని చెప్పటంలో జగన్ ఉద్దేశ్యం ఏమిటి..? అప్పటి యూపీఏ ప్రభుత్వం సమైక్యరాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించేసింది. అశాస్త్రీయ పద్దతిలో జరిగిన విభజన వల్ల ఏపీ అన్నీ విధాలుగా నష్టపోయింది. అందుకనే 2014 ఎన్నికల్లోనే కాదు 2019 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి జనాలు ఓట్లేయలేదు. ఆ పార్టీ తరపున పోటీచేసిన అభ్యర్ధులకు అసలు డిపాజిట్లు కూడా రాలేదు. అంటే కాంగ్రెస్ పార్టీకి జనాలు గొయ్యితవ్వి కప్పెట్టేశారు.
ఇక ప్రస్తుత విషయానికి వస్తే 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటినుండి నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూడా ఏపీకి అన్యాయమే చేస్తోంది. విభజన చట్టం అమలును మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేస్తోంది. చివరకు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో కూడా మొండిగా ముందుకెళుతోంది. ప్రభుత్వం, కార్మికులు, ఉద్యోగులు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ప్రైవేటీకరణ చేయద్దని చెప్పినా మోడీ పట్టించుకోవటంలేదు.
మోడీ ప్రభుత్వం వైఖరి అర్థమవ్వటంతోనే 2019 ఎన్నికల్లో జనాలు ఒక్కటంటే ఒక్క సీటులో కూడా బీజేపీని గెలిపించలేదు. చివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనాలు బీజేపీకి ఓట్లేయలేదు. ఉప ఎన్నికల్లో అయితే అసలు బీజేపీకి డిపాజిట్లే దక్కలేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఏపీ అభివృద్ధికి కేంద్రం సాయం చేయకపోతే కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి కూడా తప్పదని మోడీని జగన్ హెచ్చరించినట్లుగానే ఉంది. మరి జగన్ హెచ్చరికలను మోడీ పట్టించుకుంటారా ?