టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మృతి..
TTD EO Dharma Reddy: మూడు రోజులు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన చంద్రమౌళి చివరకు తుది శ్వాస విడిచారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డికి పుత్రశోకం మిగిల్చారు.
పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లిన పెళ్లి కొడుకు గుండెపోటుకి గురై మృతి చెందాడు. మూడు రోజులు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన చంద్రమౌళి చివరకు తుది శ్వాస విడిచారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డికి పుత్రశోకం మిగిల్చారు.
టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి అలియాస్ శివ గుండెపోటుతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు రెండు రోజుల క్రితం ప్రకటించారు వైద్యులు. ఈరోజు ఆయన మరణించినట్టు ధృవీకరించారు.
మరికొద్ది రోజుల్లో పెళ్లి..
చంద్రమౌళి (శివ) వయసు 28 సంవత్సరాలు. చెన్నై పారిశ్రామికవేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో చంద్రమౌళికి వివాహం ఖాయమైంది. ఇటీవలే నిశ్చితార్థం కూడా అట్టహాసంగా జరిపారు. త్వరలో వీరి వివాహం తిరుమల శ్రీవారి సన్నిధిలో జరగాల్సి ఉంది. ఇంతలోనే విధి ఆయన్ను బలితీసుకుంది. ముంబైలో ఉద్యోగం చేస్తూ సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న చంద్రమౌళి.. వివాహ ఆహ్వాన పత్రికలు పంచేందుకు చెన్నైకు వచ్చారు. స్నేహితులతో కలసి ఇన్విటేషన్లు పంచుతుండగా.. ఆయనకు హార్ట్ ఎటాక్ కు గురయ్యారు. వెంటనే స్నేహితులు ఆయన్ని కావేరి ఆసుపత్రికి తరలించారు.
మూడు రోజులుగా ధర్మారెడ్డి, శేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆస్పత్రివద్దే ఉన్నారు. మరికొన్ని రోజుల్లో పెళ్లి ఉండగా, ఇప్పుడిలా జరిగిందేంటని బాధపడ్డారు. 28 ఏళ్ల చిన్న వయసులోనే గుండెపోటు రావడంతో తల్లిదండ్రులు, బంధువులు తల్లడిల్లారు. మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడిన చంద్రమౌళి చివరకు తుదిశ్వాస విడిచారు.