వాట్సాప్ చూడటం లేదని టీచర్‌ని సస్పెండ్ చేసిన డీఈవో
ఈయన స్కూల్ గ్రూపు వాట్సాప్ చూడటం లేదని, స్కూల్ గ్రూపు నుంచి ఎగ్జిట్ అయ్యారని కారణం చూపుతూ ఆయన్ని జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారి సస్పెండ్ చేశారు.
స్కూల్ గ్రూపు వాట్సాప్ చూడటం లేదని ఓ ఉపాధ్యాయుడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం వివాదాస్పదంగా మారింది. వాట్సాప్ చూడని కారణంగా టీచర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని మొగల్రాజపురంలో బీఎస్ఆర్కే మున్సిపల్ హైస్కూల్లో ఎల్. రమేష్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈయన స్కూల్ గ్రూపు వాట్సాప్ చూడటం లేదని, స్కూల్ గ్రూపు నుంచి ఎగ్జిట్ అయ్యారని కారణం చూపుతూ ఆయన్ని జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారి సస్పెండ్ చేశారు.
రమేష్ వాట్సాప్ చూడకపోవడం వల్ల ఆయనతో కమ్యూనికేట్ చేయడం కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నందుకు, బాధ్యతారాహిత్యంగా ఉన్నందుకు రమేష్ ను విధుల నుంచి తప్పిస్తునట్లు అధికారులు తెలిపారు. అయితే దీనిపై రమేష్ స్పందిస్తూ మరో వాదన వినిపించారు. తనను ఫోన్ ఎక్కువగా చూడవద్దని కంటి డాక్టర్ సూచించారని, అందువల్లే ఫోన్లో వాట్సాప్ చూడటం లేదని వివరణ ఇచ్చారు.
ఇదిలా ఉంటే స్కూల్ గ్రూపు వాట్సాప్ చూడటం లేదని టీచర్ ని సస్పెండ్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. వాట్సాప్ చూడటం, చూడకపోవడం వ్యక్తిగతమని.. ఈ కారణం చూపుతూ ఉపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్ చేయడం భావ్యం కాదని విమర్శిస్తున్నారు. ఒకవేళ సదరు టీచర్ నిజంగా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అదే కారణం చూపి సస్పెండ్ చేసి ఉంటే బాగుండేదని సూచిస్తున్నారు.