డెక్కన్ క్రానికల్‌పై టీడీపీ కార్యకర్తల దాడి..
ది ఫైనాన్స్ ఎక్స్‌ప్రెస్ సైతం ఇందుకు సంబంధించి ఓ కథనం రాసింది. టీడీపీ సీనియర్ లీడర్ ఈ విషయాన్ని ధృవీకరించారని స్పష్టం చేసింది. ఈ అంశంపై విశాఖ ఎంపీ, లోకేష్ తోడల్లుడు భరత్ మాట్లాడిన ఓ వీడియో కూడా ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కార్యకర్తల దాడులు ఆగడం లేదు. తాజాగా విశాఖపట్నంలో ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ ఆఫీసుపై తెలుగుదేశం కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఆఫీసులోని ఫర్నిచర్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. అనంతరం డెక్కన్ క్రానికల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం యూ టర్న్ తీసుకుందంటూ డెక్కన్ క్రానికల్ వార్త రాయడమే ఈ దాడికి కారణం.
ఒక్కసారిగా విశాఖపట్నం బీచ్ రోడ్‌లోని డెక్కన్ క్రానికల్ ఆఫీసులోకి చొచ్చుకెళ్లిన తెలుగుదేశం కార్యకర్తలు.. కాంపౌండ్ వాల్ ఎక్కి నేమ్ బోర్డును ధ్వంసం చేశారు. ఆఫీసులో విధ్వంసం సృష్టించారు. అంతే కాదు అక్కడ ఉన్న ఫ్లెక్సీకి నిప్పు పెట్టారు. "అలయన్స్ టేక్స్ యు-టర్న్ ఆన్ VSP ప్రైవేటీకరణ" పేరుతో డెక్కన్ క్రానికల్ ఓ కథనం రాసింది. ఈ కథనం ఫేక్ అంటూ టీడీపీ కార్యకర్తలు డెక్కన్ క్రానికల్ ఆఫీసుపై దాడి చేశారు.
తెలుగుదేశం కార్యకర్తల దాడిపై డెక్కన్ క్రానికల్ యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. టీడీపీ గూండాలు తమ ఆఫీసుపై దాడి చేశారంటూ మండిపడింది. ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చారంటే.. అది దాడులు చేసేందుకు లైసెన్సు కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. దాడులతో తమను బెదిరించలేరని స్పష్టం చేసింది డెక్కన్ క్రానికల్ యాజమాన్యం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి యూటర్న్ విషయంలో తమకున్న సమాచారం నిజమేనని, తమ కథనాన్ని మరోసారి సమర్థించుకుంది. ఇక డెక్కన్ క్రానికల్ ఆఫీసుపై దాడిని జర్నలిస్టులు సైతం తీవ్రంగా ఖండిస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి వ్యూహాత్మక పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రెండు, మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ది ఫైనాన్స్ ఎక్స్‌ప్రెస్ సైతం ఇందుకు సంబంధించి ఓ కథనం రాసింది. టీడీపీ సీనియర్ లీడర్ ఈ విషయాన్ని ధృవీకరించారని స్పష్టం చేసింది. ఈ అంశంపై విశాఖ ఎంపీ, లోకేష్ తోడల్లుడు భరత్ మాట్లాడిన ఓ వీడియో కూడా ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని తాము హామీ ఇచ్చింది నిజమేనని..కానీ బీజేపీతో కూటమిలో ఉండడం వల్ల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఇబ్బందులుంటాయన్నారు భరత్.