తీరం దాటి బలహీనపడిన మాండూస్.. కోస్తా, రాయలసీమలో వర్షాలు

ఏపీలో అత్యథికంగా నెల్లూరు జిల్లా బ్రహ్మదేవంలో 12.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈరోజు కూడా వర్షాలు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు.

Advertisement
Update:2022-12-10 08:13 IST

కోస్తా తీరాన్ని హడలెత్తించిన మాండూస్ తుపాను తీరం దాటింది. తీవ్ర తుపానుగా ఉన్న మాండూస్ తీరం దాటే ముందే తుపానుగా బలహీన పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో మాండూస్ తీరం దాటింది. దీని ప్రభావంకో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఈరోజు సాయంత్రానికి తుపాను ప్రభావం మరింత తగ్గుతుందని తెలుస్తోంది.

వణుకుతున్న తీరం..

వర్షాలతోపాటు, చలిగాలులు కోస్తా తీరాన్ని వణికిస్తున్నాయి. తీరం వెంట 65నుంచి 75కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. అటు ఉత్తర కోస్తాలో కూడా చలిగాలులు, చిరుజల్లులతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఏపీలో అత్యథికంగా నెల్లూరు జిల్లా బ్రహ్మదేవంలో 12.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈరోజు కూడా వర్షాలు కొనసాగుతాయని, పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని చెబుతున్నారు అధికారులు.

శుక్రవారం మధ్యాహ్నం నుంచే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈరోజు రెండో శనివారం, రేపు ఆదివారం కావడంతో అధికారులు హడావిడి పడాల్సిన అవసరం లేకుండా పోయింది. రెవెన్యూ, సచివాలయ ఉద్యోగులకు మాత్రం ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది, అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల వరి నాట్లదశలోనే ఉన్నా.. గుంటూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల వరికోతకు వచ్చింది. రోడ్లపై ధాన్యం ఆరబెట్టిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో పత్తి పంట రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక రోడ్లపై అక్కడక్కడా చెట్లు కూలిపోవడంతో రవాణాకు ఇబ్బంది ఏర్పడింది. రేణిగుంటలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన సర్వీసులు రద్దయ్యాయి, మరికొన్ని సర్వీసులకు ల్యాండింగ్ కి అనుమతివ్వకుండా వెనక్కి పంపించేశారు.

తమిళనాడులో కూడా..

మాండూస్ ప్రభావంతో తమిళనాడులోని చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో కూడా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఐదు జిల్లాల్లో పాఠశాలలకు శుక్రవారం నుంచే సెలవలు ఇచ్చేశారు.

Tags:    
Advertisement

Similar News