కిడ్నీ అమ్మబోయి 16 లక్షలు పోగొట్టుకున్న గుంటూరు విద్యార్థిని
చివరకు కంగారుపడ్డ యువతి తాను కిడ్నీ ఇవ్వబోనని తాను చెల్లించిన 16 లక్షలు వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఢిల్లీ వస్తే డబ్బు ఇస్తామని చెప్పారు కేటుగాళ్లు.
గుంటూరులో ఒక విద్యార్థిని మోసపోయిన తీరు సంచలనంగా మారింది. ఏకంగా 16 లక్షలు పోగొట్టుకుంది. ఆ తండ్రికి భయపడి పారిపోయింది. మిస్సింగ్ కేసు పెట్టగా పోలీసులు ఆమె వెతికి పట్టుకున్నారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని వద్దే తండ్రికి చెందిన బ్యాంకు అకౌంట్‌కు సంబంధించి గూగుల్ పే ఖాతా ఉంది. ఇంటి నిర్మాణం కోసమని 20 లక్షలను సదరు ఖాతాలో యువతి తండ్రి ఉంచాడు. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని తన ఖర్చుల కోసం తండ్రికి తెలియకుండా ఆ డబ్బులో 18వేలు వాడేసింది. డబ్బు విషయంతో తండ్రికి ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతమైన యువతికి.. ఆన్‌లైన్లో కిడ్నీ డొనేషన్ యాప్ కనిపించింది.
యాప్‌లోకి వెళ్లి తన వివరాలను చేర్చి కిడ్నీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. కిడ్నీ ఇస్తే ఏడు కోట్ల రూపాయలు ఇస్తామని.. కిడ్నీ తీసుకోవడానికి ముందు మూడున్నర కోట్లు, ఆ తర్వాత మూడున్నర కోట్లు జమ చేస్తామని కేటుగాళ్లు నమ్మించారు. కిడ్నీ ఇచ్చేందుకు ఆ యువతి సరే అనడంతో.. ఆమె పేరుతో ఒక ఫేక్ బ్యాంకు అకౌంట్‌ను సృష్టించి అందులో మూడున్నర కోట్లు జమ చేసినట్టు పత్రాలు పంపారు.
దాంతో యువతి వారిని పూర్తిగా నమ్మేసింది. మూడున్నర కోట్లను యువతి సొంత బ్యాంకు అకౌంట్‌కు బదిలీ చేయాలంటే ప్రాసెస్‌కు ఖర్చు అవుతుందంటూ తొలుత 9వేలు, ఆ తర్వాత 32 వేలు ఇలా విడతల వారీగా డబ్బును లాగారు. అప్పటికే డబ్బు పంపిన యువతి వెనక్కు రాలేక వారు అడిగినంతా సొమ్మును విడతల వారీగా పంపుతూనే ఉంది. అలా తన వద్ద ఉన్న తండ్రి గూగుల్ పే అకౌంట్ ద్వారా ఏకంగా 16 లక్షలు ఖర్చుచేసింది.
చివరకు కంగారుపడ్డ యువతి తాను కిడ్నీ ఇవ్వబోనని తాను చెల్లించిన 16 లక్షలు వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఢిల్లీ వస్తే డబ్బు ఇస్తామని చెప్పారు కేటుగాళ్లు. దాంతో ఢిల్లీకి వెళ్లిన ఆ యువతి.. వారు చెప్పిన అడ్రస్ ఫేక్ అని తెలుసుకుంది. రెండో వ్యక్తికి తెలియకుండానే యువతి ఇదంతా చేసింది. చివరకు అకౌంట్‌లోని డబ్బును డ్రా చేసుకుందామని తండ్రి బ్యాంకుకు వెళ్లగా ఖాతాలో డబ్బు లేదని బ్యాంకు సిబ్బంది చెప్పారు.
బ్యాంకు స్టేట్‌మెంట్ తీయగా డబ్బు బదిలీల అంశం బయటపడింది. దాంతో కుమార్తెకు ఫోన్ చేసి నిలదీయగా భయపడిపోయిన యువతి పారిపోయి స్నేహితురాలి ఇంట్లో తలదాచుకుంది. చివరకు పోలీసులకు తన కుమార్తె కనిపించడం లేదని తండ్రి ఫిర్యాదు ఇవ్వగా.. పోలీసులు ఆమె ఎక్కడున్నది కనిపెట్టి తీసుకొచ్చారు. దాంతో మొత్తం జరిగిన వ్యవహారాన్ని వివరించింది. ఆమెకు వచ్చిన మేసేజ్‌లు, చాటింగ్ అంతా పరిశీలించిన పోలీసులు అమ్మాయిని కేటుగాళ్లు మోసం చేసినట్టు తేల్చారు. దాంతో తమకు న్యాయం చేయాలని కుమార్తెతో పాటు బాధిత తండ్రి గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు.